కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సీబీఐ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. తప్పుడు పత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించి రుణాలు తీసుకొన్నారనే కారణంతో మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడి సహా కొందరి మీద పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్పీవై రెడ్డి రెండు దఫాలు ఎంపీగా గెలవగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలో చేరారు. కానీ 2019 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వక పోవడంతో ఆయన జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు, కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే ఎస్పీవై రెడ్డి అనారోగ్యానికి గురయి మంచానికే పరిమితం అయ్యారు.
ఒకరకంగా వీరి కుటుంబం అండ జనసేన పార్టీకి గట్టిగా లభించింది. ఎందుకంటే ముందు నుంచి టీడీపీ టికెట్ తన అల్లుడికి ఇప్పించుకోవడానికి ఎస్పీవై తీవ్రంగా ప్రయత్నించారు..కానీ చంద్రబాబు ఎప్పటిలాగే మాట తప్పడమే కాక సీటు వేరేవారికి అప్పజెప్పారు. ఈ క్రమంలో ఆ పార్టీని ఎలా అయినా ఓడించాలని ఉద్దేశంతో జనసేనలో చేరి ఒకరకంగా రాయలసీమలో అండగా నిలబడిన కుటుంబంగా ఎస్పీవై కుటుంబం నిలిచింది. ఆ పార్టీ తరపున ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేశారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, ఆయన చిన్న కుమార్తె అరవింద రాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా,పెద్ద కుమార్తె సుజల శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల శాసనసభ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ గెలుపొందక పోవడంతో రాజకీయంగా సైలెంట్ అయ్యారు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రం చేస్తున్నారు.
కానీ 2019 మే నెలలో ఎస్పీవై రెడ్డి మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. ఆయన మరణానికి ముందే తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేశారని చెబుతూ 2019 ఏప్రిల్ నెలలో ఎస్పీవై రెడ్డి కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రుణాలు చెల్లించడంలో విఫలమైనందుకు ఎస్పీవై రెడ్డి పై అప్పట్లో కేసు నమోదైంది. నంది గ్రూప్ నకు చెందిన కొన్ని పత్రాలు కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఎంపీగా ఉన్న ఆయన తన నంది గ్రూప్ ఇండస్ట్రీస్ కోసం ఎస్బీఐ, సిండికేట్ బ్యాంకుతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ నిధులు చెల్లించకపోవడంతో సీబీఐకి బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
తాజాగా కూడా ఇదే కేసు మీద ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్, నంది గ్రెయిన్ డెరివేటివ్స్పై సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిలపై కేసు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని సీబీఐకి బాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది. కంపెనీ ప్రతినిధులు ఎస్పీవై రెడ్డి సహా పలువురు తమ బ్యాంకును మోసం చేశారని సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తమకు 61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది.
1978లో ఎస్పీవై రెడ్డి నంది కంపెనీని ప్రారంభించగా పీవీసీ పైపుల తయారీ చేస్తూ తరువాత అనుబంధ పైపుల తయారీకి కూడా విస్తరించింది. ఈ గ్రూప్ వ్యవసాయ పైపులు, కేసింగ్ పైపులు, ప్లంబింగ్ పైపులు, డ్రైనేజ్ పైపులు తయారు చేయడం కూడా ప్రారంభించింది. అయితే గతంలో కూడా కొందరు ఎంపీలు ఇదే తరహా కేసులు ఎదుర్కొన్నారు. టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, అప్పట్లో టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, ఇప్పుడు టీడీపీ అమలు చేస్తున్న అన్ని ప్లాన్లకి ఆలవాలంగా ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇలా వీరందరూ కూడా బ్యాంకులను బురిడీ కొట్టించి సీబీఐ కేసుల్లో చిక్కుకోవడం గమనార్హం. అయితే ఎస్పీవై రెడ్డి చనిపోయాక ఆయన కంపెనీని ఆయన పెద్దల్లుడు శ్రీధర్ రెడ్డి చూసుకుంటున్నారు.