iDreamPost
android-app
ios-app

రాయ‌పాటి నిధుల మ‌ళ్లింపు కేసులో చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉందా..?

రాయ‌పాటి నిధుల మ‌ళ్లింపు కేసులో చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉందా..?

బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. 2013లోనే తమ వద్ద రూ.300 కోట్ల రుణం తీసుకుని ట్రాన్స్‌ట్రాయ్‌ ఎగ్గొట్టిందంటూ కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కూపీలాగుతున్నారు. అంతేకాక.. రాయపాటి సంస్థ మొత్తం రూ.8,836.45 కోట్ల రుణం తీసుకుని, ఎగ్గొట్టిందంటూ 18 బ్యాంకుల కన్సార్టియం చేసిన ఫిర్యాదుపై డిసెంబర్‌ 30, 2018న సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి కూడా. ఆ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం రాయపాటి, ట్రాన్స్‌ట్రాయ్‌ ఎండీ శ్రీధర్, డైరెక్టర్లను సీబీఐ అధికారులు విచారించి.. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు రుణాల వసూలుకు సహకరించాలని బ్యాంకర్ల విజ్ఞప్తికి స్పందించకపోవడం.. ఎస్క్రో అకౌంట్‌ హామీ ఇచ్చి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.300 కోట్ల రుణం ఇప్పించడం.. అంతటితో ఆగకుండా ఖజానా నుంచి రూ.144 కోట్లను స్పెషల్‌ ఇంప్రెస్ట్‌ అమౌంట్‌ రూపంలో దోచిపెట్టడం.. ఈ వ్యవహారంలో రాయపాటి, చంద్రబాబుకు ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా సీబీఐ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.

నిబంధనల ప్రకారం కన్సార్టియం బ్యాంకుల నుంచే ఏ సంస్థ అయినా రుణం తీసుకోవాలి. కానీ.. ట్రాన్స్‌ట్రాయ్‌ మాత్రం కన్సార్టియం బ్యాంకుల కళ్లుగప్పి ఇతర బ్యాంకుల నుంచి రూ.2,267.22 కోట్ల రుణం తీసుకుంది. కన్సార్టియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.8,836.45 కోట్లు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2,267.22 కోట్లలో సంబంధిత పనులకు కాకుండా ఇతర కార్యకలాపాలకు రూ.3,822 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ దారి మ‌ళ్లించిన‌ట్లు ఈడీ ఇప్పటికే నిర్ధారించి కేసులు నమోదు చేసింది. సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, మలేసియాల్లోని సంస్థలకు ఈ నిధులను మళ్లించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నిధులు మళ్లించిన సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లపై ఇటు సీబీఐ.. అటు ఈడీ దృష్టి సారించాయి.

బ్యాంకుల కన్సార్టియం బాబుకు విజ్ఞ‌ప్తి చేసినా…

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ను దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌.. వాటిని చూపి 2013 నుంచి 2018 వరకూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌కి 18 బ్యాంకుల కన్సార్టియం రూ.8,836.45 కోట్ల రుణం ఇచ్చింది. నిజానికి దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ పోలవరం పనులు చేయలేదని.. దాన్ని తొలగించాలని 2014 నుంచి 2016 వరకూ అనేకమార్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూచించినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాక.. ట్రాన్స్‌ట్రాయ్‌ తీసుకున్న రుణాలు చెల్లించడంలేదని.. పోలవరం బిల్లులు చెల్లించే సమయంలో అప్పుల వసూలుకు సహకరించాలంటూ జూలై 31, 2015న బ్యాంకుల కన్సార్టియం విజ్ఞప్తినీ సీఎం హోదాలో చంద్రబాబు తోసిపుచ్చారు. దాంతో ట్రాన్స్‌ట్రాయ్‌ ఆ రుణాలను ఎగ్గొట్టింది. ‘ఎస్క్రో’ అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని అప్పటి టీడీపీ సర్కార్‌ హామీ ఇస్తేనే రూ.300 కోట్ల రుణం 2017లో ఇచ్చామని.. కానీ బిల్లులను ఎస్క్రో అకౌంట్‌ ద్వారా చెల్లించకపోవడంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ ఎగ్గొట్టిందని సీబీఐకి 2018లోనే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సీబీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.