Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ఈ అంశానికి సీబీఐ కోర్టు ఈ రోజు ముగింపు పలికింది. ఐదు నెలలుగా ఈ అంశంపై నిత్యం మీడియాతో మాట్లాడుతూ జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ హడావుడి చేస్తున్న రఘురామరాజుకు బ్రేక్ పడింది.
ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను ఉపయోగించుకుని వైఎస్ జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, తక్షణమే బెయిల్ రద్దు చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో రఘురామ రాజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు ప్రతివాదుల వాదనలను ఆలకించింది. జగన్‌పై దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరుగుతుండగానే మధ్యలో రఘురామరాజు ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసుకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఆ రెండింటిని కలిపి విచారించిన సీబీఐ కోర్టు.. ఒకేసారి తీర్పు చెబుతామని పేర్కొంది. ఈ మేరకు గత నెలలో విచారణను పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. రెండు పిటిషన్లను కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
Also Read : రఘురామకృష్ణం రాజు అసలు లక్ష్యం ఏమిటో, కోర్టు మార్పు కోరడానికి కారణమేంటో
వైసీపీ తరఫున నరసాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన రఘురామరాజు.. ఆ పార్టీకి, అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. తనకు సంబంధం లేకపోయినా.. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని పిటిషన్లు వేశారు. పిటిషన్ వేసినప్పటి నుంచీ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు కోర్టు తీర్పులపై అంచనాలు వేశారు. టీడీపీ అనుకూల మీడియా రఘురామరాజు ప్రెస్‌మీట్లకు, వ్యాఖ్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను వేసిన పిటిషన్ నిలబడదని తెలిసే.. ఒక్క రోజు ముందు.. అంటే మంగళవారం సీబీఐ కోర్టుపై తనకు నమ్మకం లేదని, విచారణను మరో కోర్టుకు మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఈ రోజు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.