Idream media
Idream media
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనను తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు నుంచి తనను తప్పించాలని అంతకు ముందు ఏసీబీ ప్రత్యేక కోర్టులో కూడా సండ్ర పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ తీర్పును సవాల్ చేస్తూ సండ్ర తాజాగా తెలంగాణ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ప్రమేయం ప్రత్యక్షంగా లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే సండ్ర వీరయ్య ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించిన తర్వాతనే ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు ఏసీబీ తరఫు న్యాయవాది వాదించారు. ఏసీబీ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సండ్ర అప్పీలు పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది.
గత ఆరేళ్లుగా ఓటుకు నోటు కేసు విచారణ సాగుతోంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలన్న ఉద్దేశంతో ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు ఐదు కోట్ల రూపాయలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. ఐదు కోట్ల రూపాయలకు గాను అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలను అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్‌కు ఇచ్చారు. డబ్బు ఇవ్వడం ఆడియో, వీడియోలతో సహా రికార్డయ్యాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్టీఫెన్సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ రికార్డు అయింది. అది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ విభాగం నిర్థారించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏడాదికే ఓటుకు నోటు కేసు వెలుగులోకి రావడంతో.. నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నఫళంగా హైదరాబాద్‌ను వదిలి విజయవాడకు వచ్చింది. ఏపీ, తెలంగాణలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగుతుందని రాష్ట్ర విభజన చట్టంలో పెట్టారు. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో ఆస్తుల విభజన, ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు జరిగింది. అయితే ఓటుకు నోటు కేసులో తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో డీల్‌కు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఈ డీల్‌లో భాగంగా.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలని, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదనే షరతులను కేసీఆర్ పెట్టినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలు నిజమనేలా.. సచివాలయం సహా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అప్పటికప్పుడు చంద్రబాబు విజయవాడకు తరలించారు. 2015 తర్వాత నుంచి ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ పోరు వరకూ తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ చంద్రబాబు జోక్యం చేసుకోలేదు.