లాక్ డౌన్ మరింత కఠినతరం , అధికార పార్టీ నేతలైనా గీత దాటితే కేసుల వేటు

కరోనా వైరస్ బాధితులు రోజురోజుకీ పెరుగుతున్న వేల లాక్ డౌన్ నిబంధనలు పెంచుతూ , మరింత కఠినంగా అమలు పరుస్తున్న ప్రభుత్వం లాక్ డౌన్ అమలు పరచాల్సిన అధికారులకు పూర్తి స్వేచ్చని ఇచ్చినట్టు కనపడుతోంది . ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనలు ఎవరైనా అధిగమిస్తే వారు ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నాయకులైనా సరే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొంటున్నారు .

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీస్ యంత్రాంగం తాజాగా కర్నూలు జిల్లా వైసీపీ నేతల పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది . లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని నందికొట్కూరు వైసీపీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి పైనా , మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి పైనా కర్నూల్ పోలీసులు కేసులు నమోదు చేశారు .

అయితే లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజలకు సేవ చేసే క్రమంలో వీరి పై కేసు నమోదు కావడం బాధాకరం . కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్వచ్ఛందంగా హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే క్రమంలో భౌతిక దూరాన్ని పాటించని కారణంగా వారి పైనా వారి అనుచరుల పై కూడా కేసు నమోదు చేశామని , లాక్ డౌన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కేసు నమోదు చేసి చర్యలు తీసుకొంటామని పట్టణ సిఐ తెలియచేశారు .

కాగా లాక్ డౌన్ కారణంగా ఇక్కట్లు పడుతున్న ప్రజలకు ప్రస్తుతం ఇలా స్వచ్ఛందంగా పలు విధాల సేవ చేస్తున్న దాతలు , ప్రజా సేవకుల వలన కొంత ఇక్కట్లు తొలగి ఉపశమనం పొందుతున్నారని ఇలా సేవ చేసే వారి పై కేసులు నమోదు చేస్తే సహాయం చేయటానికి ముందుకొచ్చే మిగతా వారికి తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని, నాయకులు , దాతలు , అధికారులు పరస్పర అవగాహనతో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తే ఏ సమస్యా ఉండదని దాతలు ముందుగా అధికారులకు తెలియజేసి , అధికారులు దగ్గరుండి నిబంధనలు పాటింపచేస్తూ సేవా కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా కొనసాగించాలని పలువురు పట్టణ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Show comments