iDreamPost
iDreamPost
చీరాల వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ పై కేసు నమోదయ్యింది. సీఐ రాజమోహన్ వ్యవహారశైలిపై యాతం క్రాంతి అనే కార్యకర్త కోర్టుకి వెళ్లారు. ఆయన పిటీషన్ పై స్పందించిన కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో సీఐపై కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయ్యింది.
చీరాలలో పోలీసుల తీరు ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదమయ్యింది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ వై కిరణ్ అనే యువకుడిపై పోలీసులు తీసుకున్న చర్యలు తీవ్ర దుమారం రేపాయి. కిరణ్ మృతి ఘటనకు పోలీసులే కారణమని ఆరోపణలు వచ్చాయి. దాంతో టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ సహా పలువురు పోలీసులను ఈ ఏడాది జూలైలో సస్ఫెండ్ చేశారు.
తాజాగా వన్ టౌన్ పోలీసుల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. వైఎస్సార్ విగ్రహానికి విద్యుత్ అలంకరణ చేస్తుండగా పోలీసులు ఓవరాక్షన్ చేయడంతో వివాదం మొదలయ్యింది. జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం కోసం వైఎస్సార్ విగ్రహాన్ని సిద్ధం చేస్తుడగా తమను అడ్డుకోవడమే కాకుండా, అక్రమంగా కేసులు బనాయించారని యాతం క్రాంతి ఫిర్యాదు చేశారు. దాంతో బాధితుడు కోర్టుని ఆశ్రయించినప్పటికీ తొలుత పోలీసులు కేసు నమోదు విషయంలో జాప్యం చేయడంతో మరోసారి సీరియస్ గా కోర్ట్ స్పందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వన్ టౌన్ సీఐ రాజమోహన్ మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేస్తామని అంటున్నారు.
చీరాలలో పోలీసులు రాజకీయంగా పదే పదే వివాదాల్లో ఇరుక్కోవడం విశేషంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి. తాజా పరిణామాల తర్వాత వారి తీరులో మార్పు రావాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.