Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడుకు ఆరోగ్యపరంగా కాదు కానీ, రాజకీయంగా సమస్యలు తెచ్చింది కరోనా. అధికారం కోల్పోయిన రెండేళ్లలో దాదాపు ఏడాది పాటు కరోనా కారణంగా బాబు ప్రజలకు దూరంగానే ఉన్నారు. నేరుగా కలిసింది పెద్దగా ఏమీ లేదు. జూమ్ మీటింగ్ లో మాటలు వినిపించడమే కానీ, చేతల ద్వారా సహాయం చేసింది చాలా తక్కువే.
ఓ వైపు అధికార పార్టీ నాయకుడు జగన్ కు జనాల్లో మైలేజీ అంతకంతకూ పెరిగిపోతుంటే, అది చూస్తూ బాధపడడమే కానీ, ధైర్యంగా బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితులు లేవు. కరోనా మొదటి దశలో విధించిన లాక్ డౌన్ కారణంగా చంద్రబాబునాయుడు పూర్తిగా గతేడాదిలో అత్యధిక కాలం తెలంగాణకే పరిమితం అయ్యారు. సడలింపులు తర్వాత కూడా పెద్ద యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రజాహిత కార్యక్రమాలు కానీ చేసిన దాఖలాలు లేవు.
కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని టీడీపీ
ప్రజలు కరోనా కష్టాల మధ్యన కూడా బతుకుదెరువు కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. కరోనాతో వారు సహవాసం చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే ప్రతిపక్షం ఉనికి చాటుకోవాల్సి ఉంది. ఇలాంటి అవకాశాన్ని టీడీపీ మిస్ అవుతోంది. అసలే వయసు మీద పడడం, దీనికి తోడు కరోనా విజృంభణతో చంద్రబాబు ఇల్లు దాటే పరిస్థితులు తగ్గుతూ వస్తున్నాయి.
దీంతో ఆయన జూమ్ కు మాత్రమే పరిమితం అయిపోయారు. ఆన్ లైన్ రాజకీయాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఫలితంగా ప్రజలకే కాదు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన చేరువ కాలేకపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా ఓట్ల కోసం జనాల్లోకి వచ్చి సాహసోపేతంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం రెండో దశలో కరోనా వీరవిహారం చేయడంతో ఆయన మళ్లీ జూమ్ కు చేరిపోవాల్సి వచ్చింది.
జనాల్లో తిరగలేని పరిస్థితి
ఆయన పరిస్థితి అలా ఉంటే, రెండేళ్ల కాలంలో అధికార పార్టీ వైసీపీ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి జై కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు పార్టీలో చంద్రబాబు చెప్పిందే వేదం, శాసనంగా ఉండేది. ఆయన చెప్పినదానిపై ఎక్కడా చర్చలు కూడా జరిగే పరిస్థితి ఉండేది. కరోనా కారణంగా ఆయన ఆన్ లైన్ సమావేశాలకే పరిమితం కావడంతో పార్టీలో పట్టు తగ్గుతూ వస్తోంది.
ఈ క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీనియర్ నేతలు కూడా తెలుగుదేశానికి రాజీనామా చేసిన వారు చాలా మందే ఉన్నారు. రాజీనామా చేయడమే కాదు.. చంద్రబాబు చేస్తున్న తప్పులను బహిరంగంగా ఎత్తిచూపుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండేళ్లుగా మహానాడు కూడా వర్చువల్ గానే కొనసాగడంతో అది కూడా పార్టీకి పెద్దగా ఉపయోగపడలేకపోయింది. ఇలా ఎలా చూసినా కరోనా విజృంభణ చంద్రబాబుకు రాజకీయంగా సమస్యలు తెచ్చిందనే చెప్పాలి. ఓ వైపు పార్టీ కనుమరుగైపోతుంటే, జనాల్లో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోలేని పరిస్థితి.