iDreamPost
android-app
ios-app

దూరంతో పనేముంది..? కావాల్సింది ఉపాధి, ఉద్యోగాలు

దూరంతో పనేముంది..? కావాల్సింది ఉపాధి, ఉద్యోగాలు

దేశ రాజధాని లేదా రాష్ట్రాల రాజధానుల నుంచి ప్రజలు ఆశించేంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమే. అవి ఎంత దూరం ఉన్నా సరే అక్కడ జీవనోపాధి ఉంటే చాలు అక్కడికి వెళతారు. అక్కడ ఉండే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులతో వారికి ఎలాంటి ఉపయోగం లేదు. వాటితో సామాన్య ప్రజలకు ఎలాంటి అవసరం ఉండదు. కేవలం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మాత్రమే సచివాలయం, అసెంబ్లీతో పని ఉంటుంది.

హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలే. జీవన వ్యయం సామాన్యులకు అందుబాటులో ఉండడం కూడా మరో ప్రధాన కారణం. చంద్రబాబు సర్కార్‌ హాయంలో 2014 నుంచి 2019 ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరవు విలయతాండవం చేసింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రజలు తాగేందుకు చుక్కనీరు దొరకని స్థితికి భూగర్భ జాలాలు అడుగంటాయి. ఆ సమయంలో ఆయా జిల్లాల్లోని రైతులు ఉపాధి కోసం హైదరాబాద్‌ రాగా ఉమ్మడి రాజధాని వారిని అక్కున చేర్చుకుంది.

హైదరాబాద్‌లాగే తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగుళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబై, కేరళ రాజధాని తిరువనంతపురం.. ఈ నగరాలు ఆయా రాష్ట్రాలకు సూదూరంగా ఉన్నా రాజధానులుగా ప్రజల మన్ననలు పొందాయంటే కేవలం అక్కడ లభించే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమేననడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏ రాజధాని.. ఎంత దూరం..?

– తమిళనాడు రాజధాని ఆ రాష్ట్రంలోని జిల్లాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోని సీమ, ప్రకాశం జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. తమిళనాడుకు ఓ  చివరన రాజధాని చెన్నై కేంద్రీకృతమై ఉంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నుంచి రాజధాని చెన్నైకు 707 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరునల్‌వేలి జిల్లా కేంద్ర నుంచి చెన్నైకు రావాలంటే 624 కిలోమీటర్లు ప్రయాణించాలి.

– కర్ణాటక రాజధాని బెంగుళూరు కూడా ఆ రాష్ట్రంలోని ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది. కర్ణాటకలోని బీదర్‌ జిల్లాకు రాజధాని బెంగుళూరుకు మధ్య 676 కిలోమీటర్ల దూరం ఉంది. కలబురగీ జిల్లా నుంచి 585 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు ఉంది.

– మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఆ రాష్ట్రానికి ఒక అంచున, సముద్రతీరానికి అనుకుని ఉంది. ఆ రాష్ట్రంలోని చంద్రపుర జిల్లా కేంద్రం నుంచి ముంబైకి చేరుకోవాలంటే 861 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇక గడ్చిరోలి జిల్లా నుంచి అయితే ఎకంగా 941 కిలోమీటర్ల దూరంలో రాజధాని ముంబై ఉంది. ఈ రెండు ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకోవాలంటే రాత్రి, పగలు ప్రయాణించాలి. అమరావతి జిల్లా నుంచి ముంబై మధ్య 630 కిలోమీటర్ల దూరం ఉంది.

– సముద్రతీరం ఆనుకుని విస్తరించిన కేరళ రాష్ట్రంలో కూడా రాజధాని ఓ మూలన ఉంది. ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి కాసరాగడ్‌ మధ్య 576 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల నుంచి రాజధాని తిరువనంతపురానికి మధ్య దూరం శ్రీలంక– తిరువనంతపురం మధ్య దూరం కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం.

రాజధానులకు వలస..

రాష్ట్రం విడిపోక ముందు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని యువత, ప్రజలు ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళుతున్నారు. కేవలం హైదరాబాద్‌కే కాదు చెన్నై, బెంగుళూరు, ముంబై నగరాలలో ఏపీ యువత ఉద్యోగాలు చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి రాజధాని హైదరాబద్‌కు 740 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. అయినా వారు ఎప్పుడూ తమకు రాజధాని దూరమని మాట్లాడలేదు. హైదరాబాద్‌ తమకు ఉపాధినిస్తుందా..? లేదా.? అని మాత్రమే ఆలోచించారు. రాజధాని అంటే ఉపాధి, ఉద్యోగాలు కల్పించేదిగా ఉండాలి కానీ అది ఆ రాష్ట్రంలోని ప్రాంతాలకు ఎంత దూరంలో ఉందన్నది సమస్య కాదన్నది కాదనలేని సత్యం.