Idream media
Idream media
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని ఎప్పుడో పదిహేడవ శతాబ్దంలో యోగి, కవి, తాత్వికుడు అయిన యోగి వేమన చెప్పారు. ఎప్పుడూ ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకోవద్దు అని ఆయన బోధిస్తే, సరిగ్గా రెండు శతాబ్దాల తరువాత జీవిత సత్యాలని తన కవిత్వంలో నింపిన ఉర్దూ కవి మీర్జా గాలిబ్ స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య అని చెప్పారు. ఎవరిలో ఉన్న లోపాలు వారు తెలుసుకోవాలి అని ఆయన బోధించారు.
అయితే ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు అమ్మడం ద్వారా బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల ధర పెంపు లాంటి మార్గాల్లో సగటు ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకుండా చూడాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలనుకున్న ప్రయత్నం గురించి స్పందిస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఈ రెండు ఉపదేశాలను పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తోంది.
పెద్ద సినిమాల లాభార్జన తీరు
బడ్జెట్ పరంగా, హీరోలు, దర్శకులు పరంగా పెద్ద సినిమాలుగా పిలవబడే సినిమాలు తమ పెట్టుబడులను వెనక్కి తెచ్చుకోవడంలో అనుసరించే పద్ధతి (modus operandi) దాదాపు ఒకలాగా ఉంటుంది. ఫామ్ లో ఉన్న ఒక పెద్ద హీరో డేట్లు, లేదా ఒక పెద్ద దర్శకుడి డేట్లు, కుదిరితే ఇద్దరి డేట్లూ తీసుకుని ఒక సినిమా అనౌన్స్ చేయడం, హీరోకి, దర్శకుడికీ ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా ఎలాంటిదో కూడా చూడకుండానే ఎగబడి కొనే డిస్ట్రిబ్యూటర్లకి అధిక ధరకు సినిమా అమ్మేయడం, విడుదలకు ముందే లాభాలు కళ్ళచూడడం. దీనికి పరిశ్రమ పెట్టిన ముద్దుపేరు టేబుల్ ప్రాఫిట్.
Also Read:కుప్పం ఓటమిని మభ్యపెట్టేందుకేనా పవన్ దాడి?
ఎక్కువ ధరకు సినిమాని కొన్న పంపిణీదారులు తమ పెట్టుబడులను వెనక్కి తెచ్చుకోవడానికి ఉపయోగించే మార్గాలు బెనిఫిట్ షోల పేరుతో టికెట్ ధరలు అమాంతం పెంచివేయడం, మొదటి నాలుగైదు రోజులు అదనపు షోలు వేయడానికి, టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుని, ఎక్కువ ధియేటర్లలో విడుదల చేసి మొదటి నాలుగైదు రోజులు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఇదే సినిమా ఆడేలా చేసి, సినిమా ఎలా ఉందో ప్రజలకు తెలిసేలా తన పెట్టుబడితో పాటు ఎంతోకొంత లాభం జేబులో వేసుకోవడం. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది సగటు ప్రేక్షకుడు. టికెట్ అసలు ధరకన్నా ఎక్కువ చెల్లించి జేబులు ఖాళీ చేసుకుంటాడు.
పెద్ద సినిమాలకు పారితోషికాలే శాపాలు
భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ అవసరమైన కొన్ని సినిమాలను వదిలేస్తే పెద్ద సినిమాలు అని పిలవబడే అగ్ర హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో బడ్జెట్ లో అధికభాగం హీరో, దర్శకుల పారితోషికాలకే పోతుంది. క్రేజ్ ఉన్న ప్రాజెక్టులు కాబట్టి దీనికి నిర్మాతల అత్యాశ తోడయ్యి అధిక మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లకి అమ్మేస్తారు. ఫలితం ఏమాత్రం అటూఇటూ అయితే బెనిఫిట్ షోల పేరుతో, ప్రభుత్వ అనుమతులతో టికెట్ ధరలు ఎంత పెంచినా భారీ నష్టాలు తప్పవు.
ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన అఙాతవాసి (2018)సినిమానే తీసుకుంటే దీన్ని ట్రేడ్ వర్గాలే కాకుండా పవన్ అభిమానులు కూడా డిజాస్టర్ కింద లెక్క కట్టారు. డెబ్భై కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 57.5 కోట్లు వసూలు చేసింది. అయితే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి 125 కోట్ల బిజినెస్ జరిగింది. దాంతో పన్నెండున్నర కోట్ల నష్టంతో ఫ్లాప్ కింద లెక్క కట్టాల్సిన ఈ సినిమా 67.5 కోట్ల నష్టంతో అతి భారీ డిజాస్టర్ అయింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అన్న వ్యూహాలతో ఈ సినిమా మొత్తం కలెక్షన్లలో సగభాగం మొదటి మూడురోజులలోనే వెనక్కి వచ్చింది.
Also Read: రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్
ఈ సినిమాకి హీరో పవన్, దర్శకుడు త్రివిక్రమ్ ఇద్దరి పారితోషికం కలిపి యాభై కోట్లు అని అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన నోటిలెక్క ప్రకారం పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ చెరో పదికోట్లు తీసుకుని ఉంటే నిర్మాణ వ్యయం నలభై కోట్లు అయి ఉండేది. నిర్మాత మరో పది కోట్ల లాభం తీసుకుని యాభై కోట్లకి సినిమా అమ్మి ఉంటే పంపిణీదారులు బొటాబొటి లాభాలతో సురక్షితంగా ఉండేవారు.
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ కథ కూడా ఇంతే. 85 కోట్ల బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ పారితోషికం యాభై కోట్లని పరిశ్రమలో ప్రచారం. కరోనా వల్ల అన్ని భాషల్లో అగ్ర నటులు, దర్శకులు తమ పారితోషికం తగ్గిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం ఈ సినిమాకి 18 రోజులు పనిచేసి 50 కోట్లు అందుకున్నారని టాక్ . దాదాపు తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 86 కోట్లు వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ తన లెక్క ప్రకారం ఈ సినిమాకు పది కోట్లు తీసుకుని ఉంటే పంపిణీదారులు మంచి లాభాలు కళ్ళచూసి ఉండేవారు.
లాజిక్ కి అందని బడ్జెట్లు
నిర్మాణ దశలో నిర్మాత మాటకి విలువ ఇవ్వక పోవడం, ప్రాజెక్టుకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత బడ్జెట్ అదుపులో పెట్టకపోవడం కూడా చాలా సినిమాల పట్ల శాపంగా మారుతుంది కొన్నిసార్లు. ఇందుకు ఉదాహరణ రామ్ చరణ్ నటించిన ఆరంజ్(2010) సినిమా. నాగబాబు నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ చేసిన మోసం వల్ల భారీగా నష్టపోయాననీ, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాననీ, అప్పుడు తన సోదరులు తనని ఆదుకున్నారనీ అనేకసార్లు నాగబాబు చెప్పాడు. ఆదే సందర్భంలో దర్శకుడు ఈ సినిమాని ఆస్ట్రేలియాలో చిత్రీకరించాలని అనుకోవడం కూడా బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి కారణమైందనీ, ఆ సినిమా కథ ప్రకారం ఆస్ట్రేలియాలో తీసినా అమలాపురంలో తీసినా ఒకటే అని నాగబాబు చెప్పాడు.
Also Read:పవన్.. ఏ పార్టీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు?
ఊహకందని బడ్జెట్ గురించి చెప్పుకోవలసిన వస్తే గుర్తొచ్చే మరో సినిమా 2015లో విడుదల అయిన అఖిల్. నాగార్జున కుమారుడు అఖిల్ ను హీరోగా లాంఛ్ చేసే భాధ్యత హీరో నితిన్ తండ్రి, పంపిణీదారుడు అయిన సుధాకర్ రెడ్డి తలకెత్తుకుని అప్పట్లో బాగా ఫామ్ లో ఉన్న వి. వి. వినాయక్ దర్శకత్వంలో అఖిల్ టైటిల్ తో సినిమా నిర్మించాడు. అప్పటికి నెలల వయసులో “సిసింద్రీ” అనే సినిమాలో, పెద్దయ్యాక ‘మనం’ అనే సినిమాలో నిమిషం కూడా తెరమీద కనిపించని అతిథి పాత్రలో మాత్రమే నటించిన అనుభవం ఉన్న అఖిల్ కి ఇరవై కోట్లు, దర్శకుడు వినాయక్ కి పది కోట్లు ఇచ్చి యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పద్దెనిమిది కోట్లకు కొంచెం తక్కువ వసూళ్లు సాధించి భారీ డిజాస్టర్ అనిపించుకుంది.
అదుపు చేయలేని నిర్మాత
ఒకప్పుడు సినిమా నిర్మాణం మొత్తం నిర్మాత కనుసన్నల్లో ఉండేది. క్రమేపీ అది తగ్గిపోయి, ఇప్పుడు పెద్ద హీరోల, దర్శకుల సినిమాలకి నిర్మాత డబ్బులు తీసి ఇచ్చే క్యాషియర్ పాత్రకి పరిమితం అయ్యాడని చాలా మంది ఇండస్ట్రీ జనాలే చెప్తున్నారు. అంతా హీరో లేదా డైరెక్టర్ చెప్పినట్లు జరుగుతోంది. తారాగణం నుంచి సాంకేతిక నిపుణుల వరకూ వారే ఎంపిక చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమడలేని చాలా మంది నిర్మాతలు పరిశ్రమకు దూరంగా ఉన్నారు.
ఒకప్పుడు గ్రామీణ నేపథ్యంలో జరిగే సినిమాలను అందుకు అనువైన గ్రామాన్ని చూసుకుని అక్కడే ఉండి సినిమా షూటింగ్ చేసేవారు. ఇప్పుడు గ్రామాలైనా, గుడిసెలైనా కోట్లు వెచ్చించి స్టూడియోలో సెట్టింగ్ వేస్తున్నారు. ఇక్కడ ప్రతిభావంతులైన నటులు ఉన్నా చాలా మంది తమ సినిమాలకు తెలుగు భాష రాని పరాయి భాష మాట్లాడే నటులను అధిక పారితోషికం ఇచ్చి దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల నిర్మాణవ్యయం ఎక్కువ అయినా ఏదో ఒక విధంగా రాబట్టుకోగలం అన్న ధీమా నిర్మాతలది.
వాళ్ళకి కావాల్సింది అదే
Also Read: సాయి తేజ్ సినిమాకున్న సవాళ్లేంటి
బడా నిర్మాతలు టికెట్ల అమ్మకాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విధానాన్ని మార్చడానికి ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేసినా, మొన్న ఒక సినిమా ఫంక్షన్ లో అన్న సవినయంగా విన్నవించినా, నిన్న పవన్ కళ్యాణ్ మరో సినిమా ఫంక్షన్ లో “సినిమా రంగం జోలికి వస్తే నాశనమైపోతారు” అని శాపనార్థాలు పెట్టినా అందరి కోరిక ఒకటే. బెనిఫిట్ షోల పేరుతో, పెద్ద సినిమా అన్న సాకుతో టికెట్ రేట్లు ఇష్టమొచ్చినట్టు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకుని వారం రోజుల లోపలే తమ పెట్టుబడులను రాబట్టుకునే విధంగా ప్రేక్షకుల జేబులకు చిల్లు వేసే పద్ధతిని యధాతధంగా కొనసాగించి తమ కోటానుకోట్ల వ్యాపారం నిరంతరాయంగా కొనసాగించేలా ప్రభుత్వం అంగీకరించాలి అన్నదే ఆ కోరిక.
తమ పారితోషికాలు తగ్గకూడదు. సినిమా బాగా లేకపోయినా ఆ విషయం తెలిసేలోగా ప్రేక్షకుల డబ్బుల మీద మెరుపుదాడి చేసి, పెట్టుబడి రాబట్టుకునే విధానం మారకూడదు అని బడా శక్తుల తాపత్రయం అయితే, చిన్న నిర్మాతలు, అర్ధవంతమైన సినిమాలు మన భాషలో కూడా రావాలని కోరుకునే ప్రేక్షకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. తెలుగు సినిమా తీరుతెన్నులను సమూలంగా మార్చివేయగల ఈ ఆన్ లైన్ టికెట్ అమ్మకాల విధానం అమల్లోకి వస్తుందా, వచ్చాక ప్రభుత్వం దీనిని సమర్ధవంతంగా అమలు చేయగలదా చూడాలని చాలా మంది వేచి ఉన్నారు.