Idream media
Idream media
ఏపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టులో జరుగుతున్న ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది. పరిపాలనా సౌలభ్యం కోసం విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై స్టే ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లిన రమేష్ అనే వ్యక్తికి నిరాశ ఎదురయ్యింది. స్టే ఇవ్వడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. మరిన్ని ఆధారాలతో రావాలని సూచిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని తరలింపులో భాగంగానే కార్యాలయాల తరలింపు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. అమరావతిలో రూ. 42 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం ఆపేసిందన్నారు. 40 వేల మంది అక్కడ రోజూ పనిచేసేవారని చెప్పుకొచ్చారు. అలాగే విశాఖలో మిలీనియం టవర్స్ బీని ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే వాటిని పిటిషన్‌తో పాటు జతచేయాలని సూచించింది. విశాఖ మిలీనియం టవర్స్‌లో ఐటీ సిబ్బందిని ఖాళీ చేయిస్తున్నారన్న వాదనకు సంబంధించి ఏవైనా డ్యాక్యుమెంట్లు ఉంటే తమ ముందు ఉంచాలని ఆదేశించింది.