iDreamPost
iDreamPost
విరాట్ కోహ్లీ.. భారత్ క్రికెట్ జట్టుకు దొరికన అరుదైన ఆణిముత్యం. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి. సచిన్ సృష్టించిన భారీ పరుగులు… సెంచరీల రికార్డులను తిరిగి రాస్తాడని సగటు క్రికెట్ అభిమానులు.. విశ్లేషకులు ఘంటాపథంగా చెప్పుకునే వారు. తన ప్రతిభాపాటవాలు.. బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించిన కోహ్లీ.. సినీ హీరోయిన్‌లతో డేటింగ్‌లు చేస్తూ మైదానం బయట కూడా నిత్యం వార్తలలో నిలిచేవాడు. అయితే ఇప్పుడు అదే కోహ్లీ టెస్ట్.. వన్డేల్లో కెప్టెన్సీని కోల్పోవడమే కాదు.. బ్యాటింగ్‌లో కూడా ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారుతున్నాడు.
గడిచిన మూడేళ్లుగా అటు టెస్టులలోను, ఇటు వన్డేల్లో విరాట్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఈ మూడేళ్లలో ఇప్పటి వరకు 27 టెస్టు ఇన్నింగ్స్‌లలో 760 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్ సగటు కేవలం 28.14 మాత్రమే. దీనిలో అత్యధిక పరుగులు 79. కేవలం ఆరు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. సెంచరీలు సున్నా. ఇక వన్డేల విషయానికి వస్తే 18 వన్డేలలో కేవలం 702 పరుగులు మాత్రమే చేశారు. సగటు 39 మాత్రమే. దీనిలో అత్యధిక పరుగులు 89 కాగా, 9 అర్థసెంచరీలు, సెంచరీలు సున్నా. అటు టెస్టులలోను, ఇటు వన్డేలలోను కోహ్లీ సెంచరీ చేయకపోవడం విశేషం. ఒకప్పుడు విరాట్ కోహ్లీకి టెస్టులు, వన్డేల్లో సెంచరీ అంటే మంచినీరు తాగినంత. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కువ సేపు వికెట్ల మధ్య కుదురుకోవడం కోహ్లీకి ఇబ్బందిగా మారింది.
విరాట్ కోహ్లీ ఆడిన మొత్తం టెస్టు ఇన్నింగ్స్‌లలో సగటు 50.3. వన్డేలలో అయితే 58.1 . ఇప్పటికీ సగటులో టాప్‌లోనే ఉన్నాడు. కాని మూడేళ్లుగా ప్రదర్శన అంతంతమాత్రమే. ఇప్పటి వరకు 168 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 7 వేల 943 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు 254 కాగా, 28 అర్థ సెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేలకు వస్తే 250 వన్డేలలో 12 వేల 311 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు 183 కాగా, 64 అర్థ సెంచరీలు, 43 సెంచరీలు సాధించాడు.
మాస్టర్ బ్లాస్టర్ ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్‌కు కోహ్లీ వన్డే పరుగుల లోను, సెంచరీలలోను చాలా దగ్గరకు వచ్చాడు. సచిన్ టెస్టులలో 200 ఇన్నింగ్స్‌లకు గాను 15 వేల 921 పరుగులు చేయగా, 68 అర్థ సెంచరీలు, 51 సెంచరీలు సాధించాడు. ఇక వన్డేలలో 463 వన్డేలకు గాను 18 వేల 246 పరుగులు సాధించాడు. 96 అర్థ సెంచరీలు, 49 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో సచిన్ మైలురాయిని చేరుకోవడం కోహ్లీకి కొంత కష్టసాధ్యమే అయినా వన్డేల్లో సచిన్ రికార్డులను అధిగమిస్తాడని క్రికెట్ పండితులు అంచనా వేశారు. అయితే మూడేళ్లుగా కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం రికార్డులు ఎలా ఉన్నా అతని కెరీర్‌కే ఇబ్బందిగా మారనుంది.
కోహ్లీ ప్రస్తుతం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. అతనిని రూ.14 కోట్లకు ఆ జట్టు పాడుకుంది. ఈ మెగా టోర్నీలోనైనా కోహ్లీ ఫామ్ చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. గత ఏడాది ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడి కేవలం 405 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 29 లోపే. దీనితో ఈ ఐపీఎల్ లో అయినా కోహ్లీ సహజసిద్ధమైన దూకుడుతో మెరుగైన ప్రదర్శన చూపుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.