Idream media
Idream media
కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్కటి. కొద్ది నెలల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రాన్ని మళ్లీ చేజిక్కించుకుని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. రైతు చట్టాలపై పెల్లుబికుతున్న నిరసనలను అనువుగా మార్చుకోవాలని భావిస్తోంది.
గెలుపు కోసం రకరకాల ప్రణాళికలు రచిస్తున్న సమయంలో అంతర్గత పోరు పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. పార్టీ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సొంత పార్టీపైనే విమర్శలు చేయడంతో వివాదం రాజుకుంది. కొంత కాలంగా సిద్దూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా కొందరు కీలక నేతలు సిద్ధూపై చర్యలకు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా.. రివర్స్ లో సిద్దూనే కీలక నేతలతో భేటీ అయి సంచలనం రేపారు. పీసీసీ చీఫ్ ఎంపిక అంశంలోనే అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య వార్ మొదలైనట్లు గుర్తించిన అధిష్ఠానం రాజీ ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సిద్దూకు పీసీసీపై భిన్నాభిప్రాయాలు
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న విబేధాల పరిష్కారానికి ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తో భేటీ అయ్యారు. ఇందు కోసం సిద్ధూ కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి రాహుల్ అపాయింట్ మెంట్ తీవ్రంగా ప్రయత్నించి సఫలం చెందారు. వారితో భేటీ అనంతరం సిధ్దూకు పీసీసీ చీఫ్ ఇస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి. నేడో, రేపో ప్రకటన వెలువడనుందని కూడా ప్రచారం జరిగింది. దీంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై పార్టీ నేతలు అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. కొంతకాలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న సిద్ధూకు పార్టీ అగ్ర నాయకత్వం అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు అంటున్నారు.
రాహుల్, ప్రియాంక.. చివరగా సోనియా
ఈ క్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ పెద్దలతో భేటీకి ఢిల్లీకి చేరుకున్నారు. ఈలోగా సిద్దూకు పీసీసీ చీఫ్ వార్తల ప్రచారంతో ఆయన అసంతృప్తికి గురై అగ్రనేతలు ఎవరినీ కలవకుండానే తిరిగి వెళ్లిపోయారని తెలిసింది. ఓ వైపు రాహుల్, ప్రియాంకలు సిద్ధూతో భేటీ ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తే.. మరోవైపు అమరీందర్ సింగ్ అలకబూనారు. ఈ నేపథ్యంలో ఇక సమస్య పరిష్కారానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఇటువంటి క్రమంలో అంతర్గత కుమ్ములాటలు నష్టం చేకూర్చుతాయని సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫైర్‌బ్రాండ్ సిద్దూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మధ్య చెలరేగిన వివాదానికి తెరపడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
నేడు భేటీ
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ కానున్నారు. సిద్దూ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. సోనియాతో భేటీలో సీఎం అమరీందర్ పంజాబ్‌లో నెలకొన్న పరిస్థితులను కూలంకషంగా నివేదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సోనియా దృష్టికి ఇరువుని నేతల వ్యవహారం వెళ్లినట్లు తెలిసింది. ఇకపై వారి మధ్య ఎన్నటికీ పొరపొచ్చాలు రాకుండా సోనియా ఓ ఫార్ములాను రూపొందించనున్నారట. ఈ ఫార్ములాతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు తొలిగిపోతున్నాయని ఢిల్లీ నేతలు పేర్కొంటున్నారు. నేడు జరిగే భేటీ అనంతరం వెలువడే వార్తల ద్వారా పంజాబ్ కాంగ్రెస్ లో ఇద్దరి ప్రముఖ నేతల మధ్య ఏర్పడిన అడ్డుతెర తొలగిపోతుందా, లేదా అనేది తేలనుంది.