Idream media
Idream media
గతమెంతో ఘనం..వర్తమానం అంధకారం..32 ఏళ్ల క్రితమే చేజారిన అధికారం.ఇలాంటి స్థితిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ యూపీ కాంగ్రెస్‌కి టార్చ్ బేరర్‌ల నిలిచింది.దాదాపు నేలమట్టమైన యూపీ కాంగ్రెస్‌ను పునరుద్ధరించడానికి ఓవర్‌టైమ్ కష్టపడుతున్న ప్రియాంకా గాంధీ మహిళా అజెండాతో అందరి దృష్టిని హస్తం వైపు ఆకర్షిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకపైనే భారం మోపిన కాంగ్రెస్ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టాలని ఆరాటపడుతోంది. యూపీలో బలమైన సామాజిక పునాదులు కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి తనకంటూ ఓటు బ్యాంకును సృష్టించుకొనేందుకు మహిళలే టార్గెట్‌గా వ్యూహాలు రచించింది. ప్రియాంకా గాంధీ దూకుడుగా జనాల్లోకి వెళ్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం” ద్రౌపది ఆలకించు..పిడికిలి బిగించు.. కృష్ణుడు రక్షించే కాలం కాదిది.. దుశ్శాసనుల కోర్టులో మీకు న్యాయం జరుగుతుందా.? మహిలళారా మేల్కొండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి..అందుకు మీరే నడుం బిగించాలి” అని రామ్‌ఘాట్ దగ్గర ప్రియాంక పేల్చిన మాటల తూటాలు ఇవి.
మహిళా సాధికారత..40 శాతం సీట్లు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు ప్రకటించి ప్రియాంకా గాంధీ సంచలనం సృష్టించింది. యూపీ రాజకీయ సమరంలో కులాలు, మతాలది పెద్ద పీట అనేది నగ్నసత్యం. దీంతో కులతత్వం,మతతత్వ జాడలను తుడిచిపెట్టి మహిళా ఓటు బ్యాంకును సృష్టించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇతర రాజకీయ పార్టీలను కలవరపెట్టాయి. ఆమె ‘లడ్కీ హూన్, లడ్ శక్తి హూ’ నినాదం రాజకీయ వర్గాల్లో ప్రతిధ్వనించడం ప్రారంభించింది.
కాంగ్రెస్ ఆశా కిరణం ప్రియాంకా మహిళా సాధికారతే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకొస్తే 12వ తరగతి అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేట్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలు అందిస్తామని ఎన్నికల వాగ్దానం ప్రియాంక చేశారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 160 స్థానాలలో మహిళా అభ్యర్థులను కాంగ్రెస్ బరిలో దింపనుంది.యూపీలో మొత్తం 14 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా ఆరున్నర కోట్లకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు.2017 ఎన్నికలలో పురుషుల ఓటింగ్ 59 శాతం కాగా 63 శాతం మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.గత ఎన్నికలలో బీజేపీకి 46 శాతం మంది మహిళలు ఓటు వేసినట్లు అంచనాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అంచనా ప్రకారం మహిళా ఓటర్లలో 60 శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారే.ఈ అరవై శాతం మంది మహిళా ఓటర్లను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కదులుతున్నాయి.
Also Read : లఖింపూర్ ఖేరీ రైతుల మరణాలు : ప్రమాదం కాదు.. కుట్ర అని తేల్చిన సిట్
100..100..100
యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రియాంక 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.ఆమె ‘లడ్కీ హూన్, లడ్ శక్తి హూ’ అంటూ ఇస్తున్న ఎన్నికల హామీలను జనంలోకి తీసుకెళ్లేందుకు 8 వేల మంది మహిళా వాలంటీర్లతో టీమ్ ఏర్పాటు చేశారు.ఈ టీమ్ ప్రతిరోజు 2 లక్షల మంది మహిళలను కలుసుకొని ప్రియాంక గాంధీ ఎన్నికల వాగ్దానాలను వారికి వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ కోటి పింక్ సిలికాన్ బ్యాండ్‌లు, ఆకర్షణీయమైన ప్రచార సామగ్రితో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలు, ద్రవ్యోల్బణ సమస్యలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారుస్తున్నారు.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ప్రధానంగా 100 నియోజకవర్గాలపై గురిపెట్టింది.ఈ స్థానాలలో ఉన్న ప్రతి మహిళా ఓటర్‌ని ఎన్నికలలోపు కనీసం పది సార్లు కలవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రచార సభలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 టౌన్ హాల్‌లలో ప్రత్యేక చర్చ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను రాజకీయ కేంద్రంగా నిలబెట్టడానికి ప్రియాంక చేసిన ప్రయత్నాలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయి. ఇది పార్టీ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మహిళలు, బాలికల ఉనికిని బట్టి స్పష్టమవుతుంది. ఇక స్వచ్ఛందంగా సభలకు హాజరవుతున్న జనాలను ఓట్లుగా మార్చడంలో బలమైన సంస్థాగత పునాది లేకపోవడం యూపీలో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ప్రధాన అడ్డంకిగా మారింది.
ప్రియాంకకు యూపీ అసెంబ్లీ ఎన్నికలు డూ ఆర్ డై యుద్ధం లాంటివి. రాబోయే ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ అదృష్టాన్ని పునరుద్ధరించగలిగితే జాతీయ స్థాయి నాయకురాలిగా తన సామర్థ్యాన్ని ప్రియాంకా గాంధీ నిరూపించుకున్నట్లే. ఒకవేళ కాంగ్రెస్ వైఫల్యమైతే అది ఖచ్చితంగా ఆమె ఖాతాలోనే పడుతుంది.దీంతోపాటు అది హస్తం పార్టీకి మరణ శాసనంగా మారే అవకాశం ఉంది.
Also Read : ప్రస్తుతానికి ముందుకే.. రేపు ఎలా ఉంటుందో..?