Idream media
Idream media
అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళికలనే రచిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ యూపీ ఇంఛార్జీగా కూడా ఉంటూ రెండేళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా కొత్త ప్రయత్నానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగని ప్రియాంక గాంధీని అసెంబ్లీ బరిలో దింపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. గాంధీ కుటుంబం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఖ్యాతి ప్రియాంక ఖాతాలో పడుతుంది.
ఆ విషయం పక్కన బెడితే.. ఆరోపణలు, కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ .. బీజేపీ అక్కడ బలంగానే ఉంది. ఇటీవల వెల్లడైన ఓ సర్వే కూడా మళ్లీ అక్కడ కాషాయజెండా ఎగురవేయడం ఖాయమని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ దింపి విజయం సాధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ యూపీపైనే దృష్టి పెడుతున్నారు. మొదట్లో తూర్పు యూపీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకను నియమించిన రాహుల్.. పశ్చిమ యూపీ బాధ్యతలను సింధియాకు కట్టబెట్టారు. ప్రస్తుతం సింధియా బీజేపీ గూటికి చేరిపోయారు. దీంతో మొత్తం బాధ్యతలను ప్రియాంక తన భుజాలపైనే మోస్తోంది.
ఇందిరా గాంధీని తలపించేలా వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్‌తో ఆమె హస్తం పార్టీని విజయాల బాటలో నడుపుతారని కాంగ్రెస్ శ్రేణులు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాధ్ నాయకత్వంలోని బీజేపీని ఓడించాలని ఆరాటపడుతున్నాయి. రాహుల్ నియోజకవర్గం అమేథీ, సోనియా ఎంపీగా గెలిచిన రాయ్ బరేలీ యూపీలోనే ఉన్నాయి. ఇవే కాకుండా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి, యోగి ఆదిత్యనాధ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్ కూడా ప్రియాంక మొదటి నుంచీ ఎక్కువ దృష్టి పెట్టిన తూర్పు యూపీ పరిధిలోకే వస్తాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి.
అయితే.. ప్రియాంక సీఎం అభ్యర్థిత్వంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యూపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. మా పార్టీ గెలుపు కోసం ఆమె శ్రమిస్తున్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికైతే దీనిపై స్పష్టత లేదు’ అని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. అలాగే.. కాంగ్రెస్ కు మంచి పట్టున్న రాయ్బరేలి ఆమేథి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి నామినేషన్ వేసేందుకు ప్రియాంక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ.. ఇలా అందరూ లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ చేశారు. అయితే ప్రియాంక మాత్రం యూపీ అసెంబ్లీపైనే గత కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ఆమేథి లేదా రాయ్బరేలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటుండగా ఆమేథి లోక్ సభపై కన్నేశారని మరికొందరు చెప్తున్నారు. 403 అసెంబ్లీ సీట్లున్న దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఇదే జరిగితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తొలి గాంధీ కుటుంబీకురాలిగా ప్రియాంక గాంధీ చరిత్రలో మిగిలిపోతారు. అయితే.. ఆమె యోగిని ఎంత వరకూ నిలువరించగలరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.