iDreamPost
android-app
ios-app

ఓ బషీర్‌భాగ్, ఓ నిర్భయ, ఓ లఖీంపూర్‌..

ఓ బషీర్‌భాగ్, ఓ నిర్భయ, ఓ లఖీంపూర్‌..

ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసనలు కొన్ని సార్లు తీవ్రం రూపం దాల్చి హింసాత్మకంగా మారి పార్టీల భవిష్యత్ ను కూడా తారుమారు చేస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బషీర్ బాగ్ కాల్పులు, ఢిల్లీ నిర్భయ ఘటన సందర్భంగా జరిగిన నిరసనలు అప్పటి పాలకవర్గాలకు పలు సవాళ్లు విసిరాయి. పాలకపార్టీలు తర్వాతి కాలంలో అధికారానికి దూరమవ్వడానికి కారణాలల్లో ఆయా నిరసన ఘటనలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ప్రస్తుతం లఖింపూర్ ఘటన కూడా ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న యెగీ నేతృత్వంలోని బీజేపీ టీమ్ కు ఈ హింసాత్మక ఘటన పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.

బషీర్ బాగ్ కాల్పులతో ఏపీలో విపక్షాల మధ్య ఐక్యత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమం అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాల మధ్యఐక్యతకు కారుణమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ఏకమై టీడీపీ ప్రభుత్వ పతనానికి కారణమైన అంశాలలో కీలకంగా మారింది. ‘‘ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ 2000 ఆగస్టు 28 న వామపక్షాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వగా అది హింసాత్మకంగా మారి ముగ్గురు నిరసనకారులు మృతిచెందారు. తదనంతరం వామపక్షాలు, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఆ ఘటనను ఖండించాయి. కేసీఆర్ కూడా అప్పుడే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయడంతో అప్పడు రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. అనంతరం 2004 జరిగిన ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

నిర్భయ నిరసనలతో దద్దిరిల్లిన ఢిల్లీ…

2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన సందర్భంగా జరిగిన నిరసనలు అప్పటి పాలకప్రభుత్వంపై ఎంత ప్రతికూల ప్రభావం చూపాయో కూడా తెలిసిందే. విపక్షాలతో పాటు పౌరసమాజం మొత్తం ఈ నిరసనలకు మద్దతు తెలిపాయి. జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా దేశమంతా గళమెత్తింది. దీంతో అప్పటి ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది.

Also Read : పార్టీ మీద స్వరం పెంచిన వరుణ్ గాంధీ

లఖింపూర్ ఘటనతో … ?

బషీర్ బాగ్ కాల్పులు, నిర్భయ ఘటన నిరసనలు లాగానే లఖింపూర్ ఘటన యూపీలోని అధికారపార్టీ పై ప్రతికూల ప్రభావం చూపేందుకు అవకాశముంది. ఈ ఘటన కారణంగా మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న యోగీ ప్రభుత్వం ఆశలపై నీళ్లు చల్లే అవకాశం లేకపోలేదు.బిజెపి యూపీలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. విపక్షాల మధ్య అనైక్యతకు తోడు తమ సుపరిపాలనతో చాలా సులువుగా అధికారంలోకి రావచ్చని భావించిన బీజేపీకి లఖింపూర్ ఘటన కొత్త సమస్యను సృష్టించింది. సుపరిపాలన, సోషల్ ఇంజినీరింగ్, హిందుత్వ అంశాలతో తమే పార్టీనే మళ్లీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్న కాషాయపార్టీ నేతలు లఖింపూర్ ఘటనతో మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. రాజకీయంగా జరిగే నష్ట నివారణ చర్యలపై అంతర్గత సమీక్షలకు పరిమితమైయ్యారు. విపక్షాలు ఎన్ని ఘాటు విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా కేవలం శాంతిభద్రతల అంశంగానే చెబుతోంది. లక్నో పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ లఖింపూర్ ఘటనపై మాట్లాడకుండానే వెళ్లిపోయారు. యూపీ ప్రభుత్వం కూడా బాధితులకు నష్టపరిహారం ప్రకటించడంతో పాటు రిటైర్డ్ జడ్జితో ఏకసభ్య కమిషన్ ను నియమించింది.

నేతల రెచ్చగొట్టే వైఖరే కారణమా…?

తన పాలనలో అల్లర్లే జరగలేదని, గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చెబుతున్నయూపీ సీఎం యోగికి ఈ హింసాత్మక సంఘటన తలనొప్పిని తెప్పించగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మరింత ఊతమిచ్చింది. జరుగుతున్న నిరసనలు విశాల దృక్పథంతో అర్ధం చేసుకుని సర్ధి చెప్పే ప్రయత్నం చేయాల్సింది పోయి..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఆందోళనలకు మరింత ఆజ్యం పోశారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా చేసిన ఓ రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ కావడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ‘ కేవలం కొంతమంది మాత్రమే రైతుల ముసుగులో 11 నెలలుగా ఉద్యమం చేస్తున్నారన్న మిశ్రా.. తనతో తలపడితే వారికి సరైన బుద్ధిచెబుతానంటూ’ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : కాంగ్రెస్, బీజేపీల నేతలు టీఎంసీలోకి ఎందుకు వెళుతున్నారు..?

ఎవరీ అజయ్ మిశ్రా.. ?

బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన అజయ్ మిశ్రా రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా ఉండేవారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా తన పొలిటికల్ జర్నీ ప్రారంభించిన అజయ్ మిశ్రా చాలా తక్కువ కాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగారు.. 2000 సంవత్సరంలో జరిగిన ఓ హత్యకేసులో అజయ్ మిశ్రాపై ఆరోపణలు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 2004 లో ఆ ఆరోపణలు కొట్టివేశారని కూడా పేర్కొంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిఘాసన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అజయ్ మిశ్రా ఎన్నికయ్యారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటితో లఖింపూర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున అజయ్ మిశ్రా విజయం సాధించారు. అనంతరం బ్రాహ్మణ నేతగా ఆయన ఎదిగారు.

యూపీలో బ్రాహ్మణ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ ఏడాది జులైలో జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో అజయ్ మిశ్రాకు చోటు దక్కింది. ఠాకూరు సామాజికవర్గానికి చెందిన యోగీ సీఎంగా ఉండటంతో బ్రాహ్మణ నేతలకు యూపీ బీజేపీలో ప్రాధాన్యమించారు. అజయ్ మిశ్రా, ఏకే శర్మ, జితిన్ ప్రసాద్ లకు కూడా ఈ కోవలోనే కీలకపదవులు అప్పగించారు.

బీజేపీ ఎన్ని గెలుపు వ్యూహాలు పన్నినా, సోషల్ ఇంజినీరింగ్ అమలుచేసినా లఖింపూర్ ఘటనతో బీజేపీ పెద్ద సవాలును ఎదుర్కొంటుంది. బీజేపీ విజయావకాశాలను దెబ్బకొట్టే అంశాలలో లఖింపూర్ ఘటన కూడా ఒకటిగా చెప్పవచ్చు.

Also Read : యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన