iDreamPost
android-app
ios-app

కాపునేతల చర్చోపచర్చలు.. చివరివరకు నిలబడేనా?

కాపునేతల చర్చోపచర్చలు.. చివరివరకు నిలబడేనా?

రాష్ట్రంలో అధికారం కాపు సామాజిక వర్గం కల. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన ద్వారా ఆ కల నెరవేరుతుందని చాలామంది భావించారు. చిరంజీవి సభలకు అశేషసంఖ్యలో జనం హాజరుకావడంతో ఆశలు చిగురించాయి. అదంతా ఒట్టి ఆకర్షణే అని తేలిపోయింది. ప్రజారాజ్యానికి చెప్పుకోదగ్గ స్థానాలు రాలేదు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఎంపీ పదవీకాలం ముగిశాక రాజకీయంగా చిరంజీవి సైలెన్స్‌ అయిపోయారు. అనంతరం చిరంజీవి సోదరుడు, పవన్‌ కల్యాణ్‌ జనసేనతో తెరపైకి వచ్చారు. ఆర్భాటంగా పార్టీని ప్రకటించి.. ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కానీ.. ఆరంభంలోనే పవన్‌ వేసిన తప్పటడుగులు జనసేనకు శాపంగా మారాయి. గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కూడా గెలవలేకపోయారు. ఇప్పట్లో కాపులకు రాజ్యాధికారం కష్టమేనన్న పరిస్థితి వచ్చేసింది. మరోవైపు.. కులాలకు అతీతంగా జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ జనాదరణ పొందుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాస్తయినా సత్తా చాటాలని పవన్‌ రాజకీయాలను మార్చారు. కాషాయంతో జతకట్టి వైసీపీ సర్కారుపై తిరుగుబాటు ప్రారంభించారు. ఇదిలాఉండగా.. అనూహ్యంగా కొందరు కాపు నేతలు చాపకింద నీరులా తమ కార్యాచరణను విస్తరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు ఐక్యంగా ఉండి సత్తాచాటాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో తమ ప్రాధాన్యం పెంచుకునేందుకు…ఇతర కులాలతో కలిసి ఐక్యవేదికను ఏర్పాటుచేయాలని కొందరు కాపు నేతలు నిర్ణయించారు. బీసీలు, దళితులతో కలిసి ఈ వేదిక ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. కొందరు కాపు సంఘం నేతలు ఆదివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటుచేసుకుని చర్చించుకున్నారు. గతంలో కూడా ఒకసారి వీరు సమావేశమయ్యారు. ఈ రెండో సమావేశంలో కాపునేతలు గంటా శ్రీనివాసరావు, మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రామ్మోహన్, ముద్రగడ పద్మనాభం అనుచరుడు ఆరేటి ప్రకాశ్‌ తదితరులు హాజరయ్యారు.

దళితులు, వెనుకబడిన వర్గాల నేతలతో మాట్లాడుతూ.. ఐక్యవేదికకు కలిసొచ్చేలా చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో వారంలో విజయవాడలో ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు. వాస్తవానికి ఆదివారమే ప్రత్యక్షంగా కలిసి చర్చించుకోవాలనుకున్నా కోవిడ్‌ కారణంగా జూమ్‌లో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి మొత్తం 16 మంది కాపు నేతలు హాజరయ్యారని తెలిసింది. వచ్చే విజయవాడ సమావేశంలో అందరి తరపున కోర్‌ కమిటీని వేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ సమావేశానికి వైసీపీకి చెందిన కాపునేతలను ఆహ్వానించకపోవడం ద్వారా రాజకీయాలు తప్పా, ఐక్యత అనేది లేదని స్పష్టంగా తెలుస్తోంది.