Idream media
Idream media
కుందూరు జానారెడ్డి రాజకీయాల్లో తలపండిన నేత. నల్గొండ జిల్లా, అనుముల గ్రామంలో జన్మించిన జానారెడ్డి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో చలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై పలు శాఖలకు మంత్రిగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డును అధిగమించారు. అయితే రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభ తగ్గుతూ వస్తోంది. దీంతోపాటు ఆ పార్టీ నేతలు కూడా ఉనికి కోల్పోతున్నారు. అయినప్పటికీ ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. పోటీ అయితే ఇవ్వగలిగారు కానీ గెలవలేకపోయారు.
నాలుగు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి పలు ఉన్నత పదవులు నిర్వహించిన జానారెడ్డి ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్నారు. అయితే రైతుల సమస్యలపై పీసీసీ ఇటీవల తలపెట్టిన ఆందోళనలో కనిపించారు. తన కుమారులను బరిలో నిలిపి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా ఆయన గతంలోనే ప్రకటించారు. కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయక తప్పలేదు. వాస్తవానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనే జానారెడ్డి తన కుమారులను రంగంలోకి దించాలని చూశారు. తన ఇద్దరు తనయుల్లో ఒకరైన రఘువీర్ ను ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. రఘువీర్ కు రేవంత్ రెడ్డి అండదండలు కూడా ఉన్నాయి. అయితే హైకమాండ్ మరోలా ఆలోచించింది. గెలుపే లక్ష్యంగా జానారెడ్డినే బరిలోకి దింపింది. జానా కుమారులు తన తండ్రి తరపున విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయినా గణనీయమైన ఓట్లనే సాధించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి జానారెడ్డి ఇద్దరు కుమారులు ఉవ్విళ్లూరుతున్నారట. సాగర్లో జైవీర్ మిర్యాలగూడలో రఘువీర్ తమ పర్యటనలు ముమ్మరం చేశారు. టికెట్ తమకే వచ్చేలా కింది స్థాయి నుంచి కేడర్ను కలుపుకునిపోతున్నారు. తండ్రి ఆశీస్సులతో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. అయితే అన్నదమ్ములు ఇద్దరూ పోటీలో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలో జానారెడ్డి పోటీచేయకపోతే తన ఇద్దరు కుమారులకు టికెట్లు ఇప్పించుకుంటారా? కుటుంబంలో ఒకటే టికెట్ ఇస్తే ఆయన ఎటువంటి అడుగులు వేస్తారనే చర్చ కూడా జరుగుతోంది? తన కంచుకోట సాగర్ నుంచి ఒకరికి టికెట్ ఇప్పించుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకపోయినా మిర్యాలగూడ నుంచి మరొకరికి టికెట్ అంత సులువుగా వస్తుందా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. కానీ వారిద్దరూ మాత్రం రాజకీయంగా రాణించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తండ్రి ఎలాగైనా తమకు టికెట్లు ఇప్పిస్తారనే ధీమాతో ఉన్నారు.
Also Read : KCR,TRS- కేసీఆర్ సార్ .. వేరే ఛాన్స్ ప్లీజ్ ?