Idream media
Idream media
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పార్టీని పట్టాలెక్కించడానికి యువ నాయకులను పటిష్టం చేయాలని భావిస్తుంటే.. ఉన్న వారే ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. రాహుల్ సన్నిహితులుగా పేరొందిన వారే పార్టీలో ఉండలేకపోతున్నారు.
గతంలో కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్‌కి చెందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఉత్తర ప్రదేశ్ లో బలమైన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లోనూ స్టార్ క్యాంపెయినర్‌గా ఎదిగిన సచిన్ పైలట్ సైతం పార్టీని వీడతారన్న ప్రచారం సాగింది. ఆయన ముఖ్య అనుచరులే హ్యాండ్ ఇస్తున్న క్రమంలో కాంగ్రెస్ వికాసం కోసం రాహుల్ ఎంచుకున్న దారి ఎంత వరకూ కరెక్ట్ అనే అభిప్రాయాలను సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో జీ-32 పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ సీనియర్లంతా అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదికూడా.. దేశంలో కీలకమైన ఎన్నికలు వచ్చిన వేళ ఓ మీటింగు పెట్టుకొని.. సోనియా గాంధీ రాహుల్ గాంధీలను అడగాల్సినవి అన్నీ అడిగేసా తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. మరి వీళ్లు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారా? లేదా అనేది సందేహంగానే మిగిలిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో.. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యూత్ టీమ్ ను తయారు చేసుకోవాలని చూస్తున్నారనే ప్రచారం ఆ మధ్య సాగింది. ప్రతీ రాష్ట్రంలోనూ టాలెంట్ ఉన్న యంగ్ లీడర్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని ఇందుకోసం జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు టీపీసీసీ కూర్పును చూస్తే అది వాస్తమేననే అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు.
తాజాగా ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. కొందరు కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని జూనియర్ గా చెప్పడంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవాడని అలాంటి రేవంత్ కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు.. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం.. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని అన్నట్టుగా లీకులు కూడా ఇచ్చారు.
అయినప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేతలను పక్కకు నెట్టేసింది. వాళ్ల అభ్యంతరాలను లైట్ తీసుకుంది. రేవంత్ రెడ్డికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ పాత్ర ఏ పాటిదో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంతోపాటు సుదీర్ఘ రాజకీయ చరిత్రను పరిశీలించినా.. ఉమ్మడి వరంగల్ పాత్ర అమోఘమైనది. ఈ జిల్లాలో కాంగ్రెస్ తరపున ఎందరో సీనియర్లు ఉన్నారు. కానీ.. తాజా తెలంగాణ పీసీసీలో ఇక్కడి నేతలకు ఏ మాత్రం అవకాశం దక్కకపోవడం గమనించాల్సిన అంశం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల క్ష్మయ్య నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాజీ మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే సీతక్క కొండా సురేఖ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశించారు కూడా. మిగిలిన వారు ఏదో ఒక పదవి వస్తుందని అనుకున్నారు. కానీ.. మొత్తం ఆరు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేం నరేందర్ రెడ్డికి మాత్రమే పీసీసీలో చోటు దక్కింది. సీనియర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఇదంతా చూసినప్పుడు.. జీ-32 నేతల అనుభవంతో రాహుల్ వేరే టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారా? అది పార్టీకి మేలు చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.