Idream media
Idream media
రెండు పర్యాయాలు వరుసగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్ మూడోసారి ఎలాగైనా మళ్లీ వికసించాలని తహతహలాడుతోంది. కానీ.. ఇప్పటి వరకూ ఏ ఎన్నికా కలిసి రాలేదు. దీంతో ఇకపై జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికలలో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. దేశవ్యాప్తంగా సమస్యలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాల కోసం ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 9 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ కమిటీ తాజాగా సమావేశమై పోరాట దీపికను రూపొందించింది.
2024 నాటికి కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న, తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైన కేంద్రం నిర్ణయాలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉద్యమాలకి కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తోంది. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు వ్యూహాలు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలపై దేశ వ్యాప్తంగా నిరసన చేయాలని సోనియా గాంధీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలతో కలిసి పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సహా పలు అంశాలపై సంయుక్త ఆందోళనలు చేపతామని ప్రకటించింది.
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. 2024 ఎన్నికల్లో ఎలాగైన అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఉద్యమాలతోనే బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని పావులు కదుపుతోంది. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఆ బాధ్యతలను దిగ్విజయ్ సింగ్ కు అధిష్ఠానం అప్పగించింది. నూతన వ్యవసాయ చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలు, పెట్రోలు డీజిల్ ధరల పెంపు వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించింది. కార్యచరణ బాగానే ఉన్నా.. కాంగ్రెస్ శ్రేణులు ఎంత వరకు కలిసివస్తాయో చూడాలి.
Also Read : రఘురామకృష్ణం రాజు అసలు లక్ష్యం ఏమిటో, కోర్టు మార్పు కోరడానికి కారణమేంటో