iDreamPost
android-app
ios-app

Drugs Trafficking – చంద్రబాబు తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, మళ్లీ యూటర్న్ తీసుకుంటారా

  • Published Oct 14, 2021 | 4:20 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
Drugs Trafficking – చంద్రబాబు తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, మళ్లీ యూటర్న్ తీసుకుంటారా

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా గుర్తింపు ఉన్న చంద్రబాబు కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ దూకుడుతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా డీజీపీ నుంచి వచ్చిన పరువు నష్టం లీగల్ నోటీసులు పెద్ద తలనొప్పిగా మారాయి. అసలే పార్టీ నిర్మాణ సమస్యలు, ప్రజాభిమానం సంపాదించలేకపోతున్నామన్న బెంగ, తనయుడు నారా లోకేష్ విఫల ప్రయత్నాలు అన్నింటికీ తోడు ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కోవడం టీడీపీ అధినేతకు శిరోభారం అవుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబుకి ఇది తలవంపులు తెచ్చే వ్యవహారంగా మారింది.

ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర గౌరవాన్ని పెంచే పని చేయాలి. ఆ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అధికారం ఉంటుంది. ప్రజల ముందు వాస్తవాలతో నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. కానీ చంద్రబాబు అడ్డదారుల్లో వెళ్లాలనే తన సహజనీతిని పదే పదే ప్రదర్శిస్తున్నారు. వాస్తవాలు కాకుండా అబద్ధాలతో అందరినీ నమ్మించగలమని విశ్వసిస్తున్నారు. తన వర్గం మీడియాలో చేసే ప్రచారంతో పక్కదారి పట్టించవ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎంచలేక, విషం జిమ్మేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక విధాలుగా ఇది రుజువయ్యింది. కుల, మత విద్వేషాలు రాజేసే యత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో తాజాగా డ్రగ్స్ రాకెట్ వ్యవహారాలను కూడా రాజకీయాల్లోకి తెచ్చేశారు.

గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. విజయవాడ అడ్రస్ తో వాటికి పర్మిషన్ వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు డీఆర్ఐ, ఎన్ఐఏ కూడా తేల్చిచెప్పాయి. కానీ బాబు అండ్ కో నోటికి మాత్రం అడ్డూ అదుపు లేకుండా మాట్లాడేశారు. విజయవాడకే ఆ డ్రగ్స్ వచ్చేస్తున్నాయని, చివరకు తాడేపల్లిలోనే బిగ్ బాస్ ఉన్నారని కూడా కథలు అల్లేశారు. ఆ తర్వాత కృష్ణపట్నం రేవుకి ఈ డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని కొన్నాళ్లు, చివరకు కాకినాడే దానికి కేరాఫ్‌ అంటూ మరికొన్ని కహానీలు ముందుకుతెచ్చారు. కాకినాడ ఉప్పుటేరులో ఓ బోటు తగులబడితే దానిని కూడా డ్రగ్స్ దందాకి సాక్ష్యం అన్నట్టుగా చిత్రీకరించపూనుకున్నారు.

విపక్షాల విమర్శలకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే వచ్చింది. తొలుత విజయవాడ సీపీ నుంచి ఆ తర్వాత డీజీపీ వరకూ పోలీసులు సంయమనంతో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. విజయవాడ అడ్రస్ వాడుకున్నారే తప్ప ఏపీకి ఆ డ్రగ్స్ తో ఎటువంటి సంబంధం లేదని కేంద్ర సంస్థలే నిర్థారించిన విషయాన్ని పదే పదే వెల్లడించారు. కానీ టీడీపీ మాత్రం తగ్గలేదు. ఎక్కడో ఏదో దొరికితే అది కూడా ఏపీకే సంబంధం అన్నట్టుగా జనాలను నమ్మించపూనుకుంది. ఆ క్రమంలో అడ్డందిడ్డంగా వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ మీదే మచ్చవేసేందుకు పూనుకుంది.

ఈ చర్యలను పోలీసులు సీరియస్ గా తీసుకోవడం ఇప్పుడు కథ కొత్త మలుపు తిరిగినట్టయ్యింది. దేశంలోనే తొలిసారిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ నేరుగా చంద్రబాబుకి లీగల్ నోటీసులు పంపించారు. డ్రగ్స్ సరఫరాలో ఏపీకి సంబంధం ఉందని చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. దెబ్బకు దెయ్యం వదిలిందన్నట్టుగా రెండు రోజుల నుంచి డ్రగ్స్ మాట ఎత్తితే ఒట్టు. ఒక్కరు కూడా డ్రగ్స్ కథలు వల్లించడం లేదు. చంద్రబాబు, లోకేష్, దూళిపాళ సహా అరడజను మందికి పైగా ఈ నోటీసులు జారీ కావడంతో బాబుకి దిమ్మతిరిగినట్టయ్యింది. ఇప్పటి వరకూ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే మళ్లీ యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయం వస్తుంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఇప్పుడు టీడీపీ అధినేతది. దుష్ప్రచారంతో ప్రతీసారి నెట్టుకురావాలనే యత్నం ఒక్కోసారి ఇలానే బెడిసికొడుతుందని బాబుకి డ్రగ్స్ వ్యవహారంలో బాగా బోధపడినట్టవుతోంది