Idream media
Idream media
ఐదేళ్ల క్రితం జరిగిన మణిపూర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లను సాధించలేకపోయింది. రెండో స్థానానికే పరిమితమైంది. అయినప్పటికీ.. ఇతర పార్టీల మద్దతుతో బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం.. మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేల రాకతో బలం పెంచుకుంది. ఇప్పుడు అక్కడ మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. అరవై సీట్లు గల మణిపూర్ లో కరోనా నేపథ్యంలో రెండు దశల్లో (ఫిబ్రవరి 27, మార్చి 3న) పోలింగ్ జరగనుంది. అయితే, ఇప్పటి వరకూ ఇతర పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని అందరూ భావించారు. కానీ.. తాజాగా అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో ఒంటరిగానే పోటీలో నిలబడనున్నట్లు తేలిపోయింది.
నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసే బీజేపీ పోటీ చేయనుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది. అరవై స్థానాలున్న మణిపూర్ లో నలభై స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎన్‌పీపీ అధినేత కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. అయితే సగం స్థానాలు కావాలని బీజేపీ పట్టుపట్టినట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశాయి. ఆ కార్యక్రమంలో కోన్రాడ్ సంగ్మా, మణిపూర్ డిప్యూటీ సీఎం వై.జోయ్ కుమార్ లతో పాటు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు. కానీ బీజేపీ అధిష్టానం సగం సీట్లు కావాలంటూ కోన్రాడ్ ను కోరింది. ఆయన అందుకు ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగడానికి బీజేపీ సిద్ధపడింది. నేషనల్ పీపుల్స్ పార్టీతో పొత్తు వికటించడంతో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్లు బీజేపీ ఆదివారం ప్రకటించింది.
దీంతో బీజేపీ అన్ని స్థానాలకు కూడా ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. తన సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ బీజేపీ అభ్యర్ధుల్ని ప్రకటించారు. మరోసారి మణిపూర్ లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రశాంతంగా ఉండాలంటే అది బీజేపీ వల్లే సాధ్యం అంటున్నారు కేంద్రమంత్రి. మణిపూర్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తామని భూపేందర్ యాదవ్ అన్నారు. దీర్ఘకాలంపాటు బీజేపీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇచ్చామని చెప్పారు. క్రీడలు, అధికారులు, విద్యావేత్తలకూ టికెట్లు ఇచ్చామని వెల్లడించారు.
ఐదేళ్ల క్రితం 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది సీట్లు సాధించింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ నలుగురు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే, స్వతంత్ర మహ్మద్ అషబ్ ఉద్దీన్ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ ఎన్ని స్థానాలను సంపాదించుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.