iDreamPost
android-app
ios-app

సోము వీర్రాజు చేతిలో కమలం వికసించేనా?

సోము వీర్రాజు చేతిలో కమలం వికసించేనా?

ఏపీ బీజేపీలో పాత్రలు, పాత్రధారులు మారారు. కొత్త కమల దళ సారథిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. అయితే ఆయన నియామకం, దాని పర్యవసానాలను ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషిస్తూ వెళ్తున్నారు. అత్యధిక మంది వీర్రాజు రాకతో టీడీపీకి చెక్‌ పడుతుందని అభిప్రాయపడుతుండగా, ఇంకొందరు ఎవరొచ్చినా ఏపీలో బీజేపీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదని తేలిగ్గా తీసిపారేస్తున్నారు.

వ్యూహాత్మకం…ఫలించేనా…

సోము వీర్రాజు నియామకం వ్యూహాత్మకం అనే వాదన కొందరి నుంచి బలంగా వినిపిస్తోంది. ఏపీలో పార్టీని క్రియాశీలక శక్తిగా నిలిపేందుకే అగ్రనాయకత్వం ఆయన్ను అందలం ఎక్కించిందని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అయితే అదే సమయంలో ఏపీలో కమలాన్ని వికసింప చేయగలగడం వీర్రాజు వల్ల అయ్యే పనేనా? బీజేపీ రాజకీయాలకు ఏపీలో చోటెక్కడుంది? అంటూ పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. సోము వీర్రాజు ఘూటు వ్యాఖ్యలతో బీజేపీని వార్తాల్లో నిలపగలరే కానీ, ఈవీఎం మెషీన్లలోకి ఎక్కించలేరంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో సైద్ధాంతిక పునాదులు లేవని, ఏపీ ప్రజలు ఆ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా చూసే అవకాశం లేదని అంటున్నారు.

జోడు గుర్రాల జోరు……

కొత్త అధ్యక్షుడు వచ్చినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం అంత సాఫీగా సాగదని మాత్రం చెప్పవచ్చు. బీజేపీ అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి ఉంటుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై వ్యాఖ్యానిస్తూనే టీడీపీని టార్గెట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సోము వీర్రాజు జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. రెండు ప్రధాన పార్టీలను విమర్శించేటప్పుడు బ్యాలెన్స్‌ పాటించాలి. కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంలో బ్యాలెన్స్‌ తప్పి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.

అధికారం అత్యాసే, కానీ…..

2024లో బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు బహు దూరమే. ఈ విషయం వీర్రాజుకు సైతం తెలిసిందే.అయితే కేడర్‌లో ఉత్సాహం నింపేందుకే ఆయనలా మాట్లాడి ఉండవచ్చు. ఇటీవల జనసేన నిర్వహించుకున్న సర్వేల్లో ఆ పార్టీకి ఓట్ల శాతం(5 లేదా 6 శాతం) ఏమాత్రం పెరగలేదని తేలింది. ఇక బీజేపీ పరిస్థితి మరింత తీసి కట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ–జనసేనలు పేరుకే కూటమిగా ఉన్నప్పటికీ రెండు పార్టీల నాయకులు, కేడర్‌ల మధ్య కెమిస్ట్రీ కుదరట్లేదు. కాబట్టి అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో మాకు 18 శాతం ఓట్లు వచ్చాయి, వాటిని తిరిగి సాధించాలనే సోము వీర్రాజు ఆకాంక్షలు నెరవేరడం కష్టమే.

ఆ రాజకీయాలకు చోటేది…..

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి వ్యవస్థాగత పునాదులు లేవు. రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం సోము వీర్రాజుకే కాదు కదా నరేంద్రమోదీకి సైతం కుదిరేపని కాదు. ఏపీలో బీజేపీ భావజాలానికి ఓట్లు రాలే పరిస్థితులు లేవు. ఉత్తరాదిలో హిందుత్వవాదం బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చుతోంది. కానీ, ఏపీలో ఆ పాచిక పారదు. కనీసం తెలంగాణలో బీజేపీకి ఉన్న అనుకూలత కూడా ఏపీలో లేదు. ఏపీ రాజకీయాలను మతాల కంటే కులాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పోనీ బీజేపీ కుల రాజకీయాలను మొదలుపెట్టాలనుకున్నా ఆ పనిని చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు అక్కడ కొత్తగా చేయడానికి ఏమీ లేదు.

బీజేపీ రాష్ట్రంలో బలోపేతలం అవ్వాలంటే జాతీయస్థాయి వ్యూహాలను ఏపీలో అమలు చేయకూడదు. స్థానికంగా ప్రత్యేక ఎజెండా ఉండాలి. ఇది లోపించడం వల్లే టీడీపీ ఎంతగా బలహీనపడినప్పటికీ ఆ పార్టీ కేడర్‌ బీజేపీ వైపు వెళ్లడం లేదు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీజేపీకి ఎవరు నాయకత్వం వహించినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.