iDreamPost
android-app
ios-app

ఆలయాల కూల్చివేత.. బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

ఆలయాల కూల్చివేత.. బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలన్నరకే బి.ఎస్‌.బొమ్మై ప్రభుత్వానికి పెద్ద చిక్కువచ్చి పడింది. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లో అనధికారికంగా నిర్మించిన హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేస్తుండడంతో.. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది బీజేపీ ప్రభుత్వం.

తాజాగా మైసూరు జిల్లాలోని నాన్జన్‌గూడలోని దేవాలయాన్ని అధికారులు కూల్చివేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రజలు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా పురాతన ఆలయాన్ని కూల్చివేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఆ దేవాలయం పురాతనమైనది కాదని, 12 ఏళ్ల కిత్రం నిర్మించారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం హిందూ దేవాలయాన్ని కూల్చివేసిందని ఆయన మండిపడ్డారు.

అనధికారికంగా నిర్మించిన దేవాలయాల అంశం కర్ణాటకలో 2009 నుంచి నలుగుతోంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వం.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన దేవాలయాల జాబితాను కోర్టు ముందు ఉంచింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2009 సెప్టెంబర్‌ 29 నాటికి రాష్ట్రంలో 5,688 దేవాలయాలు అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారు. కోర్టు ఆదేశాలతో ఇందులో 2,887 ఆలయాలను మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడం లేదా కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత కూల్చివేతలు ఆగినా.. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది.

అయితే ఈ నెల 7వ తేదీన మరోమారు హైకోర్టు అనధికారికంగా నిర్మించిన ఆలయాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. 2021 జూలై 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,395 అనధికారిక మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని ప్రభుత్వం లెక్కలు వేసింది.

ఆయా జిల్లాలు, మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ అనధికారిక మతపరమైన కట్టడాలు ఉన్నాయో తెలుపుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రవికుమార్‌ సవిరమైన లేఖను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లకు పంపారు.

దక్షిణ కన్నడ జిల్లాలో అత్యధికంగా 1,579 నిర్మాణాలు ఉన్నాయి. శివమొగ్గ జిల్లాలో 790, బెళగావిలో 612, కోలార్‌లో 397, బాగల్‌కోట్‌లో 352, ధర్వాడ్‌లో 324, మైసూర్‌లో 315, కొప్పాల్‌ జిల్లాలో 306 అనధికారికి నిర్మాణాలు ఉన్నట్లు ఆ లేఖలో ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఆయా కట్టడాలను తొలగించేలా వెంటనే చర్యలు చేపట్టాలని లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి తాలూక, డివిజన్‌లో వారానికి కనీసం ఒక్క కట్టడాన్ని తొలగించాలని ప్రధాన కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ధర్మపరిరక్షణకు తమ పార్టీ పని చేస్తుందని చెప్పుకునేందుకు బీజేపీ నేతలు ఆసక్తిచూపుతుంటారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ హిందుత్వ అజెండాగా ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు వారు ఎలాంటి బేషజాలు చూపరు. ఎక్కడైనా ఏదైనా దేవాలయంలో జరగకూడని ఘటన జరిగితే.. బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తారు. అలాంటిది ఇప్పుడు కర్ణాటకలో అనధికారిక దేవాలయాలను కూల్చివేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది.

ఇటీవలే సీనియర్‌ నేత యడ్యూరప్పను దించి.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా బి,ఎస్‌ బొమ్మైను బీజేపీ అధిష్టానం కూర్చొపెట్టింది. బొమ్మై ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. ఓ వైపు యడ్యూరప్పలోని అసంతృప్తి పరోక్షంగా బొమ్మై ప్రభుత్వానికి తగులుతోంది. దీనికి తోడుగా ఆలయాల ఘటన.. బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఈ పరిణామాల నుంచి బొమ్మై ప్రభుత్వం ఎలా బయటపడుతుంది..? ఆలయాల కూల్చివేతపై ఎలా ముందుకు వెళుతుంది..? అనేవి ఆసక్తికరమైన అంశాలు.