Idream media
Idream media
ఓ దశలో చింతకాయల అయ్యన్నపాత్రుడి రాజకీయ జీవితం ఓ వెలుగు వెలిగింది. మంత్రిగా, ఎమ్మెల్యేగా విశాఖ జిల్లాను శాసించే స్థితికి చేరారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచీ నాలుగు దశాబ్దాలుగా అందులోనే కొనసాగుతున్నారు. అయ్యన్న తాత లచ్చాపాత్రుడి ద్వారా అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రకంగా ఆయనకు అదృష్టం వరించిందనే చెప్పాలి. కానీ రెండేళ్లుగా తెలుగుదేశం పరిస్థితి బాగాలేదు. దీంతో అయ్యన్న పరిస్థితి కూడా అలాగే మారింది. చివరకు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారు. ఆ విషయాన్ని ఎన్నోసార్లు ఆయనే స్వయంగా చెప్పారు.
సాహసించని బాబు
పరిస్థితులను అంచనా వేసుకున్న అయ్యన్న గత ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉండాలని అనుకున్నారు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడుకు కూడా చెప్పారు. పాదయాత్ర ద్వారా జనాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న జగన్ ను దృష్టిలో ఉంచుకుని కొత్త వాళ్లకు చాన్స్ ఇచ్చే సాహసం బాబు చేయలేదు. ఆ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో అయ్యన్ననే బరిలో నిలవాలని బాబు కోరడం జరింది. సరే పార్టీ మాట మేరకు అయ్యన్నపాత్రుడు పోటీ చేశారు. చివరికి భారీ తేడాతో వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ చేతిలో ఓడారు.
వైసీపీ గూటికి సోదరుడు
ఇక ఈ రెండున్నరేళ్లలో అనేక రాజకీయ పరిణామాలు కూడా నర్సీపట్నం లో చోటు చేసుకున్నాయి. అయ్యన్న సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు వైసీపీ గూటికి వెళ్ళిపోయారు. ఆయన సతీమణి అనితకు డీసీసీబీ చైర్ పర్సన్ పదవిని జగన్ ఇచ్చారు. దాంతో అధికార దర్పం తమ్ముడి ఇంట్లో కనిపిస్తోంది. ఇంకో వైపు తమ్ముడితో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఒకనాడు తన వద్దనే శిష్యరికం చేసిన ఉమా శంకర్ దూకుడు రాజకీయాలతో అయ్యన్నకు తెగ ఇరకాటంగా ఉంది.
ఆశలన్నీ కుమారుడిపైనే..
ఇంకోవైపు చూసుకుంటే సొంత కుమారుడు విజయ్ పాత్రుడు తండ్రికి సరిగ్గా అందుకు రాలేదనే అంటున్నారు. అయ్యన్నలోని ఫైర్ ఆయన రాజకీయ చతురత కుమారుడికి రాలేదని సొంత పార్టీలోనే కామెంట్స్ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్నపాత్రుడికి 67 ఏళ్ళు నిండుతాయి. ఆయన రాజకీయాల్లో ఉండను అంటున్నారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటాను అని చెబుతున్నారు. అయితే క్యాడర్ మాత్రం అయ్యన్నే పోటీ చేయాలని ఆయన ఉంటేనే వైసీపీ స్పీడ్ కి అడ్డుకట్ట వేయగలుగుతామని అంటున్నారు.
అయ్యన్న కోరిక నెరవేరేనా?
రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్న అయ్యన్న కుమారుడిని రంగంలోకి దించారు. అతడిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని అయ్యన్న ఆరాట పడుతున్నారు. అయితే నెరవేరుతుందా లేదా అన్నది తెలియడంలేదు.నర్సీపట్నం లో ఒకపుడు టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది. అయితే ఇపుడు మాత్రం వైసీపీ బాగానే పుంజుకుంది. ఇక సొంత తమ్ముడే అయ్యన్నకు ఎదురు నిలిచిన వేళ విజయ్ పాత్రుడు పోటీకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు .చంద్రబాబు కూడా అయ్యన్న వైపే చూస్తున్నారని అంటున్నారు. ఆయన కాకపోతే వేరే ఇతర నాయకుడికి అయినా టికెట్ ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి ఆ సత్తా విజయ్ కు ఉందా అనే అనుమానం అయ్యన్ననే వెంటాడుతుందని ప్రచారం జరుగుతోంది.