iDreamPost
iDreamPost
దాదాపు రెండు దశాబ్దాలుగా మూతపడిన ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం మళ్లీ తెరుచుకోనుందా?.. స్థానిక ప్రజల ఆశలకు జీవం పోయనుందా?.. ప్రభుత్వపరంగా జరుగుతున్న ప్రయత్నాలు అటువంటి ఆశలనే చిగురింపజేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకంతో మూతపడి, ప్రైవేట్ చేతుల్లో చిక్కుకున్న ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే అవకాశాలను పరిశీలించి ఫీజిబులిటీ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా కలెక్టరును ఆదేశించింది.
43 ఏళ్ల వైభవానికి టీడీపీ సమాధి
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కృషితో ఆమదాలవలస లో సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. 1956లో శంకుస్థాపన జరిగింది. 9374 మంది రైతులు వాటాదారులుగా.. 51 శాతం ప్రభుత్వ వాటాతో 10 వేల టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ 1961-62 సీజన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. 43 ఏళ్లపాటు నిర్విరామంగా పని చేసి వాటాదారులకు లాభాలు, పది మండలాల పరిధిలోని 15 వేలమంది చెరకు రైతులకు ఉపాధి, 420 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిన ఫ్యాక్టరీ 2002లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మనుగడ కోల్పోయింది. మొదట అప్పుల సాకుతో ఫ్యాక్టరీలో 91 శాతం వాటాలను తన పేరిట బదలాయించుకున్న ప్రభుత్వం.. 2002లో దాన్ని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఆ మేరకు సహకార చట్టంలో సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం పొందింది. 2003-04 సీజన్ నుంచి క్రషింగ్ నిలిపివేయాలని ఆదేశించడంతో ఆమదాలవలస షుగర్స్ మనుగడకు ముప్పు ఏర్పడింది. అప్పట్లోనే రూ 100 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ స్థలాలు, యంత్రాలను రూ. 6.40 కోట్లకు అంబికా లామినేషన్స్ సంస్థకు ధారాదత్తం చేసింది. ఆ సంస్థ అయినా మిల్లును నడిపించే ప్రయత్నం చేయలేదు.
వ్యతిరేకించిన అప్పటి మంత్రి తమ్మినేని
మిల్లును ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రతిపాదనను 2002లో కేబినెట్లో పెట్టినప్పుడు మంత్రిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనగా మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఫ్యాక్టరీకి మరణ శాసనం రాసిన చంద్రబాబే 2014 ఎన్నికల ప్రచారంలో ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక షరా మామూలుగా హ్యాండ్ ఇచ్చారు. 2018 జూన్ 28న ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమదాలవలస వచ్చిన ఆయన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. దాని బదులు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. కనీసం అదైనా చేయలేదు.
జగన్ చొరవతో కదలిక
ఫ్యాక్టరీని తెరిపించలేమని చంద్రబాబు తేల్చి చెప్పిన ఐదు నెలలకే ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 2018 డిసెంబర్ 11న ఆమదాలవలస చేరుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రయత్నిస్తానని హామీనిచ్చారు. దానికి కట్టుబడి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఫ్యాక్టరీ అప్పులు, ఆస్తులు, యంత్రాల పరిస్థితి, ప్రైవేట్ యాజమాన్యం నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న వివరాలతో ఫీజిబులిటీ రిపోర్టు సమర్పించాలని శ్రీకాకుళం కలెక్టరును గత నెల చివరిలో ఆదేశించారు. దాంతో కలెక్టర్ శ్రీకేశ్ సంబంధిత అధికారులతో కలిసి ఈ నెల 15న ఫ్యాక్టరీని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ పరిణామాలతో రైతులు, ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.