iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఎవరిని వరిస్తుందోననే చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న ఆదిత్యానాద్ దాస్ పదవీకాలం ఈనెలాఖరుతో ముగుస్తుంది. వాస్తవానిక ఆయన జూన్ లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వ కోరిక మేరకు కేంద్రం ఆయనకు మూడు నెలల పాటు కొనసాగేందుకు అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో ఆరు నెలలు కోరితే కేవలం మూడు నెలలు మాత్రమే అవకాశం ఇచ్చారు. దాంతో మరో మూడు నెలలు కోరే అవకాశం ఉందని అంచనా. గతంలో నీలం సాహ్నీ విషయంలో కూడా ఇదే రీతిలో రెండుసార్లు మూడు నెలలు చొప్పున పెంచడంతో ఆమె ఆరు నెలల పాటు అదనంగా అవకాశం దక్కించుకున్నారు.
ఆదిత్యానాద్ దాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. నీటిపారుదల రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఇటీవల కృష్ణా జలాల వివాదం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పోలవరం నిధుల విషయంలోనూ ఆయన గట్టి ప్రయత్నాలే చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో కేఆర్ఎంబీకి కృష్ణా, జీఆర్ఎంబీకి గోదావరి నదీ ప్రాజెక్టుల నిర్వహణ అప్పగించాల్సి ఉంది. అదే సమయంలో వెలిగొండ ప్రాజెక్టుని గెజిట్ లో చేర్చడం, రాయలసీమ లిఫ్ట్ కి ఎదురవుతున్న సమస్యలను అధిగమించడం, అన్నింటినీ మించి కాటన్, ప్రకాశం బ్యారేజీ వంటి వాటిని బోర్డుల నిర్వహణ నుంచి మినహాయింపు తీసుకోవడం వంటి కర్తవ్యాలు ముందున్నాయి. వాటిని పూర్తి చేసేటంత వరకూ ఆదిత్యానాద్ దాస్ ని కొనసాగించాలని ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి వినతులు కేంద్రానికి చేరకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ ఆదిత్యానాధ్ దాస్ పదవీకాలం పొడిగింపు లేని పక్షంలో కొత్త సీఎస్ గా ఎవరికి ఛాన్స్ వస్తుందోననే అంశం కూడా ఆసక్తిరేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం ఏడో స్థానంలో ఆదిత్యానాద్ దాస్ ఉన్నారు. ఆయన కన్నా ముందున్న ఆరుగురిలో ప్రస్తుతం సమీర్ శర్మ, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరభ్ కుమార్ వంటి వారు ఏపీ క్యాడర్ లో ఉన్నారు. వారి తర్వాత అదే లెవెల్ లో పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి వంటి మహిళా అధికారిణులు కూడా ఉన్నారు. దాంతో వారిలో ఎవరిని జగన్ ఎంపిక చేస్తారనేదే చర్చనీయాంశమే. సమీర్ శర్మ కొద్దికాలం క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చారు. అయితే ఈ నవంబర్ లో ఆయన రిటైర్మెంట్ కావాల్సి ఉంది. దాంతో ఆయనకు అవకాశాలు స్వల్పమే అనే ప్రచారం ఉంది. ఇక సతీష్ చంద్రకి టీడీపీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం అడ్డంకి కావచ్చనే వాదన వినిపిస్తోంది. నీరభ్ కుమార్ ప్రసాద్ సీఎస్ పోస్టు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకు ఛాన్స్ వస్తుందా లేక మహిళా అధికారుల్లో ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది చూడాలి.
కొద్దిరోజుల క్రితమే మునిసిపల్ వ్యవహారాల కమిషనర్ స్థానం నుంచి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి స్థానానికి యర్రా శ్రీలక్ష్మికి పదవీయోగ్యం దక్కింది. దాంతో ఆమెకు సీఎస్ హోదా ఖాయమేననే వాదన వస్తోంది. నీరబ్ కుమార్ ప్రసాద్ ని సీఎస్ చేస్తే 2024 వరకూ ఆయన కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతో 2026ల పదవీ విరమణ చేయాల్సిన శ్రీలక్ష్మికి సీఎస్ స్థానంలో కూర్చునేందుకు మార్గం ఉంటుంది. కానీ అప్పటి వరకూ వేచి చూస్తారా లేక ఇప్పుడే ఆమెకు సీఎస్ హోదా కట్టబెడతారా అన్నది చూడాలి. జగన్ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్ష్మి పట్ల సీఎం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. కానీ ఏదైనా జగన్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే కొత్త సీఎస్ వ్యవహారం ఆధారపడి ఉంటుందని చెప్పు. దాంతో ఆయన ఎవరి వైపు మొగ్గుచూపుతారో చూడాలి.