Idream media
Idream media
తాజాగా జరిగిన ఎన్నికకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఎలాగైనా టీడీపీని గెలిపించి పార్టీలో పరపతి పెంచుకోవాలని పాపం అచ్చెన్న అక్కడే మకాం వేశారు. గ్రూపులను, అసంతృప్తులను తన శక్తి మేరకు కలిపి ప్రచారం చేశారు. కానీ సోమవారం జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. అక్కడ టీడీపీ కనీస స్థానాలలో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. అక్కడ 2014 నుంచి కూడా సంస్థాగతంగా వైసీపీ బలంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మరింత బలపడింది.
నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశానికి గట్టి పట్టు ఉండేది. ఏడేళ్లుగా అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. ఫలితంగా పార్టీ పట్టుకోల్పోయింది. టీడీపీ తరఫున నిలబడే నాయకులు కరువయ్యారు. ఉన్నవాళ్లు పార్టీని గట్టెక్కించేందుకు వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కలిసిరావడం లేదు. ఇదిలా ఉండగా నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు పొందేందుకు అధిష్ఠానం అచ్చెన్నాయుడు కు బాధ్యతలు అప్పగించింది. ఆదిలోనే.. టికెట్ల రగడతో ఏర్పడిన వివాదాలు అచ్చెన్నను ఇబ్బంది పెట్టాయి. నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ కు, నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను సవరించడం అచ్చెన్న వల్ల కాలేదు. ఎవరిదారి వారిదే అన్నట్లుగా ప్రచారం నిర్వహించి మొత్తం మీద మమ అనిపించారు.
అధికార పార్టీ నుంచి ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మొదటి నుంచీ వైసీపీని ఉరకలెత్తించారు. పార్టీకి విజయం అందించేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేశారు. 54 డివిజన్లు ఉన్న ఆ కార్పొరేషన్లో ముందుగానే ఎనిమిది డివిజన్లు ఏకగ్రీవంగా వైసీపీ చేతికి వచ్చేశాయి. మిగిలిన డివిజన్లు కూడా పార్టీ ఖాతాలో పడేలా బాగానే ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీదే పైచేయి అని అనిల్ నమ్మకంతో ఉన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీకే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రచ్చలో అచ్చెన్నపై పార్టీలో ఓరకమైన ముద్ర పడిపోయింది. నెల్లూరు కార్పొరేషన్ లో పార్టీని పట్టాలెక్కించి విధేయుడిగా పేరు పొందాలని అచ్చెన్న తాపత్రయపడుతున్నారు. మరి అచ్చెన్నాయుడి కృషి ఏ మేరకు ఓట్లు రాబడుతుందో చూడాలి.
Also Read : AP Municipal Election, Polling Completed – నెల్లూరులో తక్కువ.. కుప్పంలో ఎక్కువ..