Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడైనా గెలుస్తారంటారా.? కుప్పం మున్సిపాల్టీ వైసీపీ పరమైన తర్వాత ఈ తరహా చర్చ కూడా ఏపీలో జరుగుతోంది. బహుశా.. అధికార పార్టీ రికార్డు విజయాలు ఈ చర్చకు కారణంగా మారొచ్చు. చంద్రబాబు పరిస్థితే అలా ఉంటే.. ఇక అచ్చెన్నాయుడుపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి సీటుపై వైసీపీ పట్టు బిగిస్తోంది. దువ్వాడ శ్రీను పార్టీని పటిష్టం చేస్తున్నారు. అచ్చెన్న తప్పులను బహిర్గతం చేస్తూ ఆయనను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీనికి తోడు అవినీతి ఆరోపణలు, పార్టీలోని లోపాలు అచ్చెన్నకు శాపంగా మారనున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి అచ్చెన్న పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చలు జరుగుతున్నాయి.
టెక్కలి నుంచి వరసగా రెండు సార్లు అచ్చెన్నాయుడు గెలుస్తూ వచ్చారు. అంతకు ముందు ఆయన హరిశ్చంద్రపురం నుంచి 1996 తరువాత పలుమార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో జరిగిన శాసనసభ సీట్ల పునర్ వ్యవస్థీకరణలో హరిశ్చంద్రపురం సీటు కనుమరుగు అయిపోయింది. అయితే అందులోని బలమైన మండలాలు టెక్కలిలో చేరడంతో ఆయన టెక్కలిని సొంత సీటుగా చేసుకున్నారు. అయితే.. గత రెండు సార్లుగా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీను అచ్చెన్నాయుడుకు గట్టి పోటీనే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు. అచ్చెన్న ఫ్యామిలీకి సంతబొమ్మాళి మండలంలో కొంత పట్టు ఉండడం కలిసి వచ్చింది. అయితే.. ఇప్పుడు ఎలాగైనా అచ్చెన్నాయుడును ఓడించాలనే కసితో దువ్వాడ పని చేస్తున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన పనితీరును పరిశీలించిన జగన్ శ్రీనుకు ఎమ్మెల్సీగా కూడా చాన్స్ ఇచ్చారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన పని చేస్తున్నాడు. అచ్చెన్న దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ అచ్చెన్నాయుడుని చాలెంజ్ చేశారు. ఆయన అవినీతిపరుడని ఎండగట్టారు. ఆయన రాజకీయం ఈసారితో సరి అని కూడా చెప్పేశారు. అన్నట్లుగానే.. టీడీపీ కేడర్ ను వైసీపీ వైపు తిప్పుకుంటున్నారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చెన్న ఇలాకాలో కూడా వైసీపీ జెండా రెపరెపలాడింది.
ఇదిలా ఉంటే.. తిరుపతి ఉప ఎన్నిక ముందు పార్టీని ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్న అభ్యంతరకర మాటల వల్ల స్థానికంగా కేడర్ ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఏ పార్టీ అండతో అధికారాన్ని చెలాయిస్తున్నారో మరిచిపోయి అచ్చెన్న మాట్లాడడం సరికాదని భావనను తెలుగు తమ్ముళ్లు వ్యక్తపరుస్తున్నారు. ఒకవైపు వైసీపీ పుంజుకుంటుండడం, మరోవైపు అచ్చెన్నాయుడు పరపతి తగ్గుతుండడం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఇప్పటి నుంచే ఏర్పడుతోంది.