iDreamPost
android-app
ios-app

చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టిన కాగ్ ..ఏమి సమాధానం చెబుతాడో ?

  • Published Jun 18, 2020 | 3:40 AM Updated Updated Jun 18, 2020 | 3:40 AM
చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టిన కాగ్ ..ఏమి సమాధానం చెబుతాడో ?

చంద్రబాబునాయుడు నిర్వాకాన్ని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కడిగిపారేసింది. అధికారంలో ఉన్నపుడు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించటమే కానీ ఏ ఒక్క శాఖలో కూడా కేటాయించిన నిధులను ఖర్చుపెట్టలేదంటూ కాగ్ చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టింది. 2017-18 సంవత్సరంతో పాటు అంతకుముందు సంవత్సరాల్లో కూడా బడ్జెట్లో చేసిన కేటాయింపులను, తర్వాత చేసిన ఖర్చులను శాఖల వారీగా కాగ్ బయటపెట్టింది.

రెండు రోజుల క్రితమే అధికారపార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరు చూసిందే. శాఖల వారీగా జగన్ ప్రభుత్వం చేసిన కేటాయింపులపై మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించినట్లు కొన్ని శాఖలను ఉదాహరణలుగా చెప్పాడు. నిజానికి శాఖలకు నిధులు కేటాయించటం ఎంత ముఖ్యమో వాటిని నూరుశాతం ఖర్చు చేయటం కూడా అంతే ముఖ్యం. అయితే చంద్రబాబు మాత్రం గొప్పల కోసం కేటాయింపులు చేసేసి ఖర్చులు మాత్రం చేయలేదన్న విషయం ఇపుడు బయటపడింది.

కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం వివిధ శాఖలకు కేటాయించిన నిధులతో పోల్చుకుంటే రూ 34,605 కోట్లు ఖర్చ చేయలేదని బయటపడింది. కాగ్ నివేదికలోని కొన్ని ఉదాహరణలను తీసుకుంటే 2017-18 ఆర్ధిక సంవత్సరంలో మున్సిపల్ శాఖకు రూ. 5,014 కేటాయించినా ఖర్చయినది మాత్రం రూ. 3719 కోట్లు మాత్రమే. అలాగే గ్రామీణాభిశాఖకు చేసిన కేటాయింపులు రూ. 16,787 కోట్లయితే చేసిన ఖర్చు రూ. 13,272 కోట్లు మాత్రమే.

అలాగే చంద్రబాబు తరచూ ఎంతో గొప్పగా చెప్పుకునే భారీ నీటి పారుదల శాఖకు రూ. 16,051 కోట్లు కేటాయించినా చేసిన ఖర్చు మాత్రం రూ. 6874 కోట్లు మాత్రమే. దీంతోనే నీటిపారుదల శాఖపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ అర్ధమైపోతోంది. ఇక చిన్ననీటి పారుదల శాఖకు రూ. 2868 కోట్లు కేటాయిస్తే ఖర్చయినది మాత్రం రూ. 1382 కోట్లు మాత్రమే. రోడ్లు, భవనాల శాఖకు కేటాయించింది రూ. 3,649 కోట్లయితే చేసిన ఖర్చు మాత్రం రూ. 914 కోట్లు మాత్రమే. ఇలాగే మరికొన్ని శాఖలకు చేసిన కేటాయింపులు, చేసిన ఖర్చులను బయటపెట్టింది. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి మాత్రమే కాదు అంతుకుముందు మూడు సంవత్సరాలు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే చేసిందని కాగ్ బయటపెట్టిన లెక్కలకు మరి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతాడో చూడాల్సిందే.