Idream media
Idream media
తొమ్మిదేళ్ల తర్వాత దక్కిన అధికారాన్ని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేశారో.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక దందా ఎలా సాగించారన్న అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం హాయంలో సాగిన దందాను కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బయటపెడుతోంది. తాజాగా మద్యం తయారీ, విక్రయాలలో జరిగిన దందాను కాగ్ బట్టబయలు చేసింది. అదనపు ఉత్పత్తికి అవకాశం ఇచ్చి.. రుసుము వసూలు చేయకపోవడం. మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు సాగించినా చర్యలు లేకపోవడం.. ఇలా లెక్కలేనన్ని అక్రమాలు బాబు హాయంలో జరిగాయి. అబ్కారీ అధికారులు కేసులు నమోదు చేసినా.. సంబంధిత దుకాణాలు, సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోలేదు. కనీసం జరిమానా కూడా విధించలేదంటే టీడీపీ హాయంలో మద్యం అక్రమాలు ఏ విధంగా సాగాయో అర్థమవుతోంది.
ఆరోపణలకు బలం కాగ్ నివేదిక..
బాబు హయంలో మద్యం తయారీ, విక్రయాలలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు ఐదేళ్లపాటు వెళ్లువెత్తాయి. ఆ ఆరోపణలను తాజాగా కాగ్ నివేదిక నిర్థారించింది. ఎలాంటి సిఫార్సు లేకుండా ఐదు మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు. అందులో నాలుగు కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీవీఎస్ డిస్టలరీస్, విశాఖ డిస్టలరీస్, పీఎంకే డిస్టలరీస్, శ్రావణి ఆల్కో బ్రూవరీస్ సంస్థల నుంచి 22.40 కోట్ల రూపాయలు వసూలు చేయలేదని కాగ్ వెల్లడించింది. అదే విధంగా అదనంగా మద్యం ఉత్పత్తిని పెంచుకునేందుకు కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం ఉత్పత్తి కోటాను పరిగణలోకి తీసుకోకుండా పాత సామర్థ్యం మేరకే రుసుములు ప్రభుత్వం వసూలు చేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 19.26 కోట్ల రూపాయల మేర గండి పడింది.
మద్యం దుకాణాలపై చర్యలే లేవు..
బాబు హాయంలో మద్యం సిండికేట్లు సాగించిన దందాకు కాగ్ నివేదిక నిదర్శనంగా నిలుస్తోంది. దుకాణాల్లో లూజు విక్రయాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బ్రాండ్ మిక్సింగ్, బార్లలో కౌంటర్ సేల్, మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్ట్ షాపుల నిర్వహణ, సమయపాలన అతిక్రమణ తదితర నేరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు 2014–15 నుంచి 2018–2019 వరకూ 20,475 కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆయా కేసులకు సంబంధించి తదుపరి చర్యల వివరాలను నేర చిట్టా నివేదికలో పొందుపరచలేదంటే ప్రభుత్వ పెద్దలే సిండికేట్లను నడిపించారని తేలిపోయింది.
ఇప్పుడు ఏమంటారో…?
తప్పులెంచువారు తమ తప్పులెరగరు అన్నట్లుగా.. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్పై నిత్యం ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు తాజాగా కాగ్ బట్టబయలు చేసిన మద్యం అక్రమాలకు ఏం సమాధానం చెబుతారు..? జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా మాజీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. నాడు బాబు హాయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన కేఎస్ జవహర్ అయినా ఇప్పుడు కాగ్ నివేదికపై స్పందిస్తారా..? లేదా అలవాటు ప్రకారం ఈ అంశంపై కూడా అధినేత బాబు నుంచి మాజీ అమాత్యుల వరకూ మౌనం వహిస్తారా..? వేచి చూడాలి.