iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి, హైకోర్టు కర్నూలులో ఉండాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆపార్టీ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం కూడా ఆమోదించి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అన్నీ అమరావతిలోనే ఉండాలని కోరుతున్న వారికి సీపీఎం నిర్ణయం రుచించే అవకాశం లేదు. అయినప్పటికీ కర్నూలు హైకోర్టుని సీపీఎం బలపరచడం కీలక పరిణామంగా భావించాలి.
అదే సమయంలో అమరావతి ఉద్యమం గురించి సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెండేళ్లుగా నిత్యం ఏదో రూపంలో అమరావతి ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్న వారికి మింగుడుపడని రీతిలో రాఘవులు మాటలున్నాయి. అమరావతి పేరుతో సాగుతున్నది ఓ ఉద్యమం మాదిరి కాకుండా రాజకీయ పార్టీ కార్యక్రమంలా మారిపోతోందనే అభిప్రాయం రాఘవులు వ్యక్తం చేశారు. దాని వల్ల అమరావతి ప్రాంతానికే కాకుండా అది ఉద్యమం అని చెబుతున్న వారికి కూడా చేటు చేస్తుందని హెచ్చరించారు.
ఇటీవల పాదయాత్ర సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో నడిపిన ప్రహసనాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని నడిపించిన రాకేష్ తికాయత్, అశోక్ ధావలే వంటి నేతలను తిరుపతి బహిరంగసభకు ఆహ్వానించి వెనక్కి తగ్గారని రాఘవులు ఆరోపించారు. మోదీ ప్రభుత్వ మెడలు వంచిన రైతు నేతలను ఇది అవమానించడం అంటూ అభిప్రాయపడ్డారు.ఓ రాజకీయ పార్టీ లక్ష్యాల కోసం ఇలా ఓ సారి పిలిచి, ఆ తర్వాత వద్దని చెప్పడం ఉద్యమానికి శ్రేయస్కరం కాదని హితువు పలికారు.
అమరావతి పేరుతో సాగుతున్న రాజకీయ తంతు మీద ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. ఇటీవల పాదయాత్ర కూడా చంద్రబాబు రాజకీయ యాత్ర అంటూ వైసీపీ విమర్శించింది. ఇప్పుడు సీపీఎం కూడా దానిని బలపరిచేలా వ్యాఖ్యానించింది. రాజకీయ లక్ష్యాల కోసం అమరావతిని అడ్డుపెట్టుకున్నారనే అనుమానం వ్యక్తం చేసింది. పైగా బీజేపీ ఒత్తిడితో జాతీయ స్థాయి రైతు నేతలను పిలిచిన తర్వాత అవమానించడం ఏమిటని సీపీఎం నిలదీసింది. దాంతో రాఘవులు వ్యాఖ్యలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. అమరావతి ఉద్యమం వెనుక సాగుతున్న పరిణామాలను ఎండగట్టేందుకు కారణమవుతున్నాయి.