iDreamPost
android-app
ios-app

చికెన్ దొర‌కాలంటే చుక్క‌లు క‌న‌ప‌డేవి

చికెన్ దొర‌కాలంటే చుక్క‌లు క‌న‌ప‌డేవి

చికెన్ ధ‌ర‌లు త‌గ్గాయి, చికెన్ ప్రియుల‌కి శుభ‌వార్త అని చ‌దివి న‌వ్వొచ్చింది. ఇపుడు ప్ర‌తి వంద మీట‌ర్ల‌కు ఒక చికెన్ సెంట‌ర్ ఉంది. కానీ ఒక‌ప్పుడు చికెన్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల‌బ‌డాల్సి వ‌చ్చేది.

కోడిమాంసం తిన‌డం మా చిన్న‌ప్పుడు చాలా క‌ష్ట‌మైన ప‌ని. వ్య‌వ‌సాయం ఉండి కోళ్లు పెంచుకునే వాళ్ల‌కైతే OK. కానీ అవేమీ లేనివాళ్ల‌కి క‌ష్టం. ఎందుకంటే నాటుకోళ్లు అంత సుల‌భంగా దొరికేవి కావు. దొరికినా కొని తిన‌లేనంత ధ‌ర ఉండేవి. పండ‌గ‌ల‌కి, ప‌బ్బాల‌కి కోడి తెచ్చుకునేవాళ్లం. దాని డ్రెస్సింగ్ అదో పెద్ద ప‌ని. మ‌సీదు ద‌గ్గ‌ర సాయిబుకి పావ‌లా ఇస్తే కోసిచ్చేవాడు. దానికి ఈక‌లు పీకి ప‌సుపు రాసి, పుల్ల‌లు పోగు చేసి మంట‌పెట్టి కాల్చేవాళ్లం. త‌ర్వాత కోసి ముక్క‌లు చేయ‌డం, చిన్న‌చిన్న ముక్క‌లుగా కోస్తే మాంసం ఒదిగొస్తుంద‌ని ఆశ‌.

క‌ట్టెల పొయ్యి మీద ఉడుకుతున్న‌ప్పుడు ఆ వాస‌న‌కే స‌గం క‌డుపు నిండేది. జ‌నం ఎక్కువ‌, కోడి త‌క్కువ‌. ఏదో నాలుగు ముక్క‌లు పులుసుతో స‌ర్దుకునేవాళ్లం. నాకున్న ఆక‌లికి గండ‌భేరుండ ప‌క్షి కూడా చాలేది కాదు.

1977 నాటికి పౌల్ట్రీ రంగం ప్రారంభ‌మైంది. అనంత‌పురం ప‌ట్ట‌ణం మొత్తం మీద వెట‌ర్న‌రీ హాస్ప‌ట్ల‌లో మాత్రమే చికెన్ దొరికేది. అది కూడా ఆదివారం మాత్రమే. ఉద‌యం ఐదు గంట‌ల‌కెళ్లి టోకెన్ తెచ్చుకోవాలి. కొంచెం ఆల‌స్య‌మైనా దొరికేది కాదు. త‌ర్వాత గంట‌ల త‌ర‌బ‌డి WAIT చేస్తే చికెన్ దొరికేది.

ఆ త‌ర్వాత అడుగ‌డుగునా చికెన్ సెంట‌ర్లు. మ‌నం చికెన్ తినాలి అని అనుకుంటే అర్ధ‌రాత్రి కూడా తినొచ్చు. KFC , మెక్‌డొనాల్డ్‌ల‌తో స‌హా చికెన్‌లో ఎన్ని ర‌కాలున్నాయో అన్నీ తినేశాను

కానీ….

చిన్న‌ప్పుడు పుల్ల‌ల మీద కాల్చి, క‌ట్టెల పొయ్యి మీద ఉడికించిన చికెన్ రుచి ఎన్న‌టికి రాదు.

ఆక‌లిగా ఉన్న‌ప్పుడు నాలుగు ముక్క‌లే ద‌క్కాయి.
తందూరి కోళ్లు ఎదురుగా ఉన్న‌ప్పుడు ఆక‌లి చచ్చిపోయింది.
జీవితంలో ఉన్న విషాదం ఇదే!