iDreamPost
iDreamPost
ఉభయ తెలుగు రాష్ట్రాలు గంపెడాశతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వైపు చూశాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎజెండాను కేంద్రం ముందుంచాయి. తమ కోర్కెల చిట్టాను వినిపించాయి. దాంతో ఏదో మేరకు కేంద్రం కనికరించకపోతుందా అనే ఆశాభావం వ్యక్తమయ్యింది. కానీ తీరా చూస్తే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనల్లో ఇరు రాష్ట్రాలకు ఒరిగిందేమిటనే ప్రశ్న వినిపిస్తోంది. నిర్మలా సీతారామన్ ప్రకటన సంతృప్తి పరిచిన దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి నివేదించారు. అయితే వాటిని ఏమేరకు కేంద్రం పరిగణలోకి తీసుకుందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ ప్రాథమిక లెక్కల్లో ప్రాధాన్యత కనిపించడం లేదు.
ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం సవరించాల్సి ఉంది. సవరించిన డీపీఆర్ ని ఆమోదించేందుకు ఆర్థిక శాఖ ముందు ప్రతిపాదనలున్నాయి. కానీ దానిని ప్రస్తావించిన దాఖలాలు లేవు. అదే సమయంలో నదుల అనుసంధానం గురించి కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. రెండు నదుల యాజమాన్య బోర్డుల ద్వారా ఆయా ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యింది. తాజాగా పెన్నా-కావేరి నదుల అనుసంధానం గురించి బడ్జెట్ లో మంత్రి ప్రస్తావించారు.
పోలవరం పూర్తి చేయడం ద్వారా గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, ఎగువన రాయలసీమకు కృష్ణా నదీ జలాల వినియోగం పెంచాలని చాలాకాలంగా ఏపీ వాసులు ఆశిస్తున్నారు. కానీ జాతీయ ప్రాజెక్టులో దానిని పూర్తి చేయాల్సిన కేంద్రం మాత్రం దానికి అనుగుణంగా కేటాయింపులు చేయకపోవడం నిరాశ పరుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో కనీసంగా రూ. 10వేల కోట్లు కేటాయిస్తే వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తుంటే కేంద్రం దానికి సానుకూలంగా స్పందించలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
నీతి ఆయోగ్ ప్రతిపాదించిన రూ. 24వేల కోట్ల కు సంబంధించిన తెలంగాణ నిధులను కూడా బడ్జెట్ లో ప్రస్తావించలేదు. అందులో ఇండస్ట్రియల్ అభివృద్ధి, ఫార్మా కారిడార్ అభివృద్ధి సహా పలు ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనిపించలేదు. ప్రత్యేక హోదా సహా విభజనకు సంబంధించిన అన్ని హామీలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. ముఖ్యంగా వివిధ పథకాల కింద రాష్ట్రాలకు కేటాయించే వాటాను లక్ష కోట్లకు ప్రణాళికా నిధుల కింద కేటాయిస్తామని చెప్పినప్పటికీ తెలుగు రాష్ట్రాలకు ఏమేరకు లబ్ధి అందుతుందన్నది సందేహంగా మారింది. ఎస్ ఈ జెడ్ లలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా కల్పించడం ఏపీకి కొంత మేలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ సెజ్ వంటివి అభివృద్ధి బాట పట్టేందుకు కొంత దోహదపడవచ్చని భావిస్తున్నారు.
ఇక ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, ఉద్యాన వన పంటల ఎగుమతులకు మార్గం సుగమం కావడం కొంత వరకూ దోహదపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, కడప స్టీల్ సహా వివిధ పరిశ్రమలకు కేంద్రం కేటాయింపులు వంటివి మాత్రం ఈ బడ్జెట్ లో కూడా అవకాశం రాలేదు. వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ఎనిమిదేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడం నిరాశపరుస్తోంది. వాటికి కూడా కేటాయింపులు అరకొరగానే ఉండడం ఆశానిపాతంగా మారింది. ఇక రైల్వే జోన్ విషయం కూడా పెండింగులో ఉంది. దానికి సంబంధించి కూడా అడుగు వేసిన దాఖాలాలు కానరాలేదు. ఇక వ్యవసాయంలో డ్రోన్ల గురించి ప్రస్తావించడం ద్వారా భవిష్యత్తులో కొంత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నప్పటికీ పారిశ్రామిక రంగంలో అభివృద్ధికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాధాన్యతలను బడ్జెట్ పరిగణలోకి తీసుకోలేదనే వాదన ఉంది.
సోలార్ పవర్ కి సంబంధించి రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో ఉన్న ప్రాజెక్టులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. వరుసగా ప్రతీ బడ్జెట్ లో కూడా కేంద్రం ఇదే దోరణిలో ఉండడంతో ఈసారి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పలువురు అంటున్నారు. ఈసారి పూర్తిగా ఐదు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా రాబోయే గుజరాత్ ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పలువురు భావిస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలకు తగిన స్థానం దక్కకపోవడం నిరాశ కలిగిస్తోందనే అభిప్రాయం సీఐఐ తెలంగాణా చాప్టర్ ప్రతినిధులు కూడా వ్యక్తం చేశారు.