త్వ‌ర‌లో ఇండియాకి విజ‌య్ మాల్యా-ఆయ‌న విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రించిన బ్రిట‌న్ సుప్రీం కోర్టు

బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టి విదేశాల్లో జ‌ల్సాలు చేస్తున్న లిక్క‌ర్ వ్యాపారి, మాజీ ఎంపి విజ‌య్ మాల్యా త్వ‌ర‌లోనే ఇండియాకు రానున్నారు. త‌న‌ను భార‌త్‌కు పంపించొద్దంటూ విజ‌య్ మాల్యా పెట్టుకున్న పిటిష‌న్‌ను బ్రిట‌న్ కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో ఆయ‌న ఇక ఇండియా రావ‌డం ఖాయ‌మైంది. యునైటెడ్ స్పిరిట్స్ మాజీ య‌జ‌మాని, కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ మాల్యా ఆర్థిక మోసం, మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఆయ‌న‌పై వ‌చ్చిన అభియోగాల‌పై సిబిఐ, ఈడిలు ద‌ర్యాప్తు చేస్తున్నాయి.

పరారీలో ఉన్న ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు రూ.9,961 కోట్లు (1.05 బిలియ‌న్ డాల‌ర్లు) ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన ఆయనను ఏ క్షణమైనా భారత్‌కు తీసుకొచ్చే అవకాశముందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వర్గాలు తెలిపాయి. భారత్‌కు పంపించొద్దంటూ మాల్యా పెట్టుకున్న అప్పీల్‌ను బ్రిటన్‌ సుప్రీం కోర్టు మే 14న కొట్టివేయడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయి. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి ప్రీతి పటేల్‌ సంతకం చేసిన త‌రువాత‌ ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారు.

విజ‌య్ మాల్యా 2016 మార్చిలో భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి లండన్ లో నివసిస్తున్నారు. మాల్యా యుకెలో అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకున్నాడు. అన్ని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకునే సంద‌ర్భంగా అన్ని ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే వ‌చ్చాయి. భారతదేశానికి అప్పగించడానికి వ్యతిరేకంగా వేసిన చివ‌రి అప్పీల్ కు వ్య‌తిరేకంగా మే 14 న యుకె ఉన్నత కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయ‌న చివ‌రి ప్ర‌య‌త్నంలో కూడా ఓట‌మి చెందాడు. దీంతో ఇండియాకు రావ‌డం అనివార్యం అయింది. ఇలాంటి ఆర్థిక నేర‌గాళ్లను స్వ‌దేశానికి అప్ప‌గించ‌డానికి సంబంధించిన ఒప్పందంపై భార‌త్‌, యుకె 1993 నవంబ‌ర్‌లో సంత‌కం చేశాయి. ఆ ఒప్పందంలో భాగంగానే విజ‌య్ మాల్యా దేశానికి రానున్నారు.

మాల్యాను మోడీ సర్కారు 28 రోజుల్లో భారత్‌కు తేవాల్సి ఉందని, ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయని, ఏ తేదీన మాల్యాను తరలిస్తారన్న దానిపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. అయితే విజ‌య్ మాల్య ఎప్పుడైనా ఏ క్ష‌ణ‌మైనా దేశానికి తీసుకొచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈడి ఉన్న‌తాధికారి తెలిపారు. విజయ్‌ మాల్యాపై ముంబైలో కేసు నమోదై ఉండటంతో ఆయనను లండన్‌ నుంచి నేరుగా ఇక్కడికే తీసుకొస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Show comments