iDreamPost
android-app
ios-app

ఊహించని వివాదం సద్దుమణిగింది.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక పూర్తి..

ఊహించని వివాదం సద్దుమణిగింది.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక పూర్తి..

శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామి వారి మఠం పీఠాధిపతి వివాదం సద్దుమణిగింది. కొన్ని రోజులుగా మఠం పీఠాధిపతి పదవికి ఎవరికి దక్కాలనేదానిపై వారసులు మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. ప్రస్తుత పీఠాధిపతిగా పని చేసి ఇటీవల పరమపదించిన వీరభోగ వసంత వేకంటేశ్వరస్వామి పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని నూతన పీఠాధిపతిగా, రెండవ భార్య మొదటి కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేశారు. తదనంతరం రెండవ భార్య కుమారుడు పీఠాధిపతిగా ఉండేలా నిర్ణయించడంతో ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది.

స్వామి వారి కుటుంబ సభ్యులే పీఠాధిపతులు..

శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి వారు.. చివరి సారిగా వైస్సార్‌ కడప జిల్లా కందిమల్లాయపల్లిలో కాలజ్ఞానం బోధించి జీవ సమాధి అయ్యారు. ఆయన జీవసమాధి అయిన ప్రాంతంలో దేవాలయం నిర్మించి.. మఠం ఏర్పాటు చేశారు. మఠం ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు పీఠాధిపతులుగా వీరభ్రహ్మంద్రస్వామి వారి కుటుంబ సభ్యులే కొనసాగుతున్నారు. చివరిగా వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి పీఠాధిపతిగా ఉన్నారు.

వివాదం ఎందుకు చెలరేగింది..?

ఏడు తరాలుగా పీఠాధిపతులుగా వీరభ్రహ్మేంద్ర స్వామి వారి కుటుంబ సభ్యులే పీఠాధిపతులుగా ఎంపికవుతూ వస్తున్నారు. అయితే చరిత్రలో తొలిసారి పీఠాధిపతి ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఉండడమే సమస్యకు కారణం. వేంకటేశ్వర స్వామి పెద్ద భార్య చంద్రావతికి ఎనిమిది మంది సంతానం. ఇందులో నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద భార్య అనారోగ్యంతో మరణించిన తర్వాత.. వేంకటేశ్వర స్వామి మారుతీ మహాలక్ష్మమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు.

Also Read :బద్వేల్ ఉప ఎన్నిక -ఆమె మౌనం.. టీడీపీకి కష్టం

వీలునామా తో వివాదం..

వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి మరణం తర్వాత ఎవరు పీఠాధిపతిగా ఉండాలనే అంశంపై ఆయన రాసిన వీలునామనే ఈ వివాదానికి ఆజ్యం పోసింది. మొదటి భార్య సంతానంలో రెండవ కుమారుడు. రెండవ భార్య సంతానంలో రెండవ కుమారుడు పేరును వీలునామాలో రాయడంతో పీఠం కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. ప్రారంభంలో వివాదాన్ని పరిష్కరించేందుకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణా ప్రతాప్‌ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.

పెద్ద భార్య మొదటి కుమారుడు వేంకటాద్రి స్వామీకే పీఠాధిపతిగా పట్టం కట్టాలని గ్రామస్థుల నుంచి డిమాండ్ వినిపించింది. ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో ఈ వాదనకు బలం చేరుకుతోంది. వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండవ కుమారుడు పేరు ఉంది. వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతి కిడ్నీలు పాడై ఆసుపత్రిలో చేర్చిన సమయంలో ఆమెకు కిడ్నీలు దానం చేసిన వారికే పీఠాధిపతి హోదా వస్తుందని వెంకటేశ్వర స్వామి మాటిచ్చాడు. అప్పట్లో రెండవ కుమారుడు ముందుకు వచ్చి కిడ్నీదానం చేశాడు. మాట ఇచ్చినట్లుగానే మొదటి భార్య రెండవ కొడుకు పేరును వీలునామాలో చేర్చారు. దీంతో ఆయనకు మరి కొందరు మద్దతు పలికారు.

పీఠాధిపతి కోసం రెండో భార్య పట్టు..

తన కుమారుడికి కూడా పీఠాధిపతి ఇవ్వాలనే ప్రతిపాదన వీలునామాలో ఉందని, తన కుమారుడికి చిన్న వయస్సు ఉండటంతో ఆ పీఠాన్ని తానే అధిరోహిస్తాని రెండవ భార్య మారుతీ మహాలక్ష్మమ్మ వాదించారు. నాడు అందరి వాదోపవాదాలు విన్న దేవాదాయ శాఖా డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ ఇప్పట్లో తేలే అంశం కాదని నిర్ధారణకు వచ్చి…. ప్రాధమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు. తాజాగా దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు.

పీఠాధిపతి అర్హతలు..

కాలజ్ఞాన బోధకులు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు మఠాధిపతి అయ్యే వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మఠం నియమ, నిబంధనలు పాటించాలి. మఠాధిపతి కావాలంటే కచ్చితంగా హిందూమతం, వేదాంత శాస్త్రాల్లో పట్టు ఉండాలి. అవన్నీ అలవోకగా బోధించే సత్తా ఉండాలి. ధార్మిక గ్రంధాల్లో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానం మెండుగా ఉండాలి. మఠంలో శిస్యులుగా ఉన్నవారికి జ్ఞానబోధ, హిందూ సంప్రదాయాలను నేర్పించగలిగే సమర్ధత ఉండాలి.

Also Read : భీమిలిపై చినబాబు దృష్టి!