Idream media
Idream media
మూడు రాజధానుల ఏర్పాటు వైపు వడివడిగా అడుగులు వేస్తున్న సర్కారు అకస్మాత్తుగా ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు, నోటిఫికేషన్లు చెల్లవంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. ప్రభుత్వ నిర్ణయాలు, కమిటీల నివేదికలు రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు బృందం పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మన్నవ సుబ్బారావు, లంకా దినకర్, మరికొంతమంది వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఈ పిటిషన్లు అడ్డుతగులుతూ వచ్చాయి. బిల్లులోని కొన్ని లోపాల కారణంగానే అడ్డంకులు వస్తున్నట్లు భావించిన జగన్ సర్కారు బిల్లులను ఉప సంహరించుకుంది.
అయితే.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లు సభ ఆమోదం పొంది, ప్రస్తుతానికి అమరావతియే రాజధాని అయినట్లు న్యాయపరంగా కనిపించినా… రాజధాని వికేంద్రీకరణ ఆశయంలో ఎలాంటి మార్పులేదని ముఖ్యమంత్రి జగన్ ఆనాడే స్పష్టంగా ప్రకటించారు. “చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే. సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు హైకోర్టులో ఉపసంహరణ బిల్లు అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను” అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గత నెలలో సర్కారు జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో మూడు రాజధానుల అంశం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటూ మూడు రాజధానులకు సంబంధించి కూడా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంటుందని కొద్దిరోజులుగా ప్రచారం ఊపందుకుంది. తాజాగా మూడు రాజధానులు, ప్రత్యేక హోదా అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి రాజధాని విశాఖయే అని తేల్చిచెప్పేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ‘మూడు రాజధానుల నిర్ణయం మా విధానం. ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం. 3 రాజధానుల బిల్లులో లోపాలు సవరించి.. కొత్త బిల్లుతో ముందుకొస్తాం. ప్రత్యేక హోదా విషయం విభజనచట్టంలో ఉంది. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదాని సాధించేవరకు పోరాటం చేస్తాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నాం. ప్రభుత్వ సాధన అనేది మా ప్రభుత్వ విధానం’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
Also Read : కేంద్రం మళ్ళీ మాట మార్చింది.. హోదా తొలగించింది