iDreamPost
android-app
ios-app

రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్

  • Published Sep 28, 2021 | 2:13 PM Updated Updated Mar 11, 2022 | 10:42 PM
రూటు మార్చిన రాహుల్, కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్

కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది. కొత్త రక్తం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఫలితాన్ని సాధిస్తోంది. రాహుల్ సారధ్యంలో పెను మార్పులకు ఇది సంకేతంగా కనిపిస్తోంది. దేశంలో మళ్లీ పూర్వ వైభవం కోసం చేస్తున్న ప్రయత్నంలో కొత్త తరాన్ని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రాహుల్ పంథా మార్చినట్టు కనిపిస్తోంది. తాజాగా సీపీఐ నాయకుడు,జేఎన్‌యూ విద్యార్థుల మాజీ నేత కన్హయ్య కుమార్‌తో పాటుగా గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తిగా మారింది. దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు ఇది దోహదపడేలా కనిపిస్తోంది.

జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ దేశం దృష్టిని ఆకర్షించారు. 2016లో జేఎన్‌యూలో జరగిన పరిణామాలతో ఆయన పేరు మారుమ్రోగింది. మంచి ఉపన్యాస సామర్థ్యం కలిగిన కన్హయ్యకు దేశమంతా ఆదరణ లభించింది. దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించినా, ఢిల్లీ హైకోర్టు ఆవరణలో ఆయన మీద దాడి జరిగిన వెనుకడుగు వేయకుండా కన్హయ్య వ్యవహరించారు. దేశమంతా పర్యటించారు.

మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలపై గళమెత్తారు. ఆ తర్వాత 2019 జనరల్ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం నుంచి బరిలో దిగారు. సీపీఐ అభ్యర్థిగా బెగుసరాయ్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. కన్హయ్యకు ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నుంచి తగిన మద్ధతు రాకపోవడంతో ఓటమి పాలయినట్టు చెప్పుకున్నారు.

గుజరాత్ రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగిన వారిలో దళిత నేత జిగ్నేష్ మేవాని ఒకరు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలతో జిగ్నేష్ తెరమీదకు వచ్చారు. 2017 లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి వడ్గాం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాటి నుంచి రాజకీయంగా మరింత క్రియాశీలకంగా మారారు. మోదీ సొంత రాష్ట్రంలో దళితుల సమస్యలపై నిత్యం స్పందిస్తూ కీలక స్థానానికి ఎదిగారు. ఓవైపు హార్థిక్ పటేల్ ఓ కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనకు తోడుగా దళితుల్లో ఆదరణ కలిగిన జిగ్నేష్ మేవాని తోడు కావడం విశేషం.

ఇటీవల ప్రశాంత్ కిషోర్ వ్యవహారం కాంగ్రెస్‌లో కీలకంగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టిన పీకే కాంగ్రెస్‌లో పావులు కదపడం ప్రారంభించారు. ఆయన సూచనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌లో కీలక మార్పులు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల పంజాబ్ పరిణామాల్లో పీకే సలహా మేరకే ఆ రాష్ట్రంలో తొలి దళిత సీఎంని నియమించడం ద్వారా పంజాబ్ వ్యవహారాల్లో పీకే పాత్ర బయటపడింది. తాజాగా కన్హయ్య, జిగ్నేష్ చేరిక వెనుక కూడా పీకే ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అంతకుముందే ఆయన మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసమంటూ శరద్ పవార్ సహా పలువురు నేతలతో చర్చించారు. దానికి తగ్గట్టుగా మమతా బెనర్జీ వంటి వారు సుదీర్ఘకాలం తర్వాత 10 జన్ పథ్ లో అడుగుపెట్టారు.

అయితే పీకే కూడా త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఉంది. ఆయనకి కీలక పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. జూనియర్లకు, కొత్తగా పార్టీలో చేరిన వారికి కీలక పదవులు కేటాయిండం కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన నేతలకు రుచించడం లేదు. ఇటీవల అసమ్మతి కాంగ్రెస్ నేతలు కూడా ఓ డిన్నర్ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌లో పీకే హవా ప్రారంభం కావడం పట్ల వారంతా చర్చించినట్టు ప్రచారం సాగింది. తాజాగా కన్హయ్య, జిగ్నేష్ కూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కొత్త పరిణామంగా చెప్పవచ్చు. ఇప్పటికే గుజరాత్‌లో హార్థిక్ పటేల్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయగా త్వరలో జిగ్నేష్‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మళ్లీ దళితులకు దగ్గరయ్యేందుకు గానూ పంజాబ్ సీఎం చరణ్​సింగ్​ సింగ్ చన్నీ సహా జిగ్నేష్‌ని కూడా వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కూడా వారిద్దరూ కీలక బాధ్యతలు నిర్వహించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బీసీ వర్గానికి చెందిన కన్హయ్య సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. తల్లి అంగన్ వాడీ వర్కర్ గా సీపీఐ కుటుంబం వారిది. అయితే సీపీఐ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగిన ఆయన త్వరలో ఆపార్టీకి సారధి అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగినప్పటికీ కాంగ్రెస్ గూటిలో చేరడం ద్వారా ఆ శిబిరంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. కన్హయ్యకు కూడా రాహుల్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రధాన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో వాగ్ధాటి గల కన్హయ్యను విస్తృతంగా వినియోగించడం ఖాయం. ఈ నేపథ్యంలో కొత్త టీమ్ తో రాహుల్ 2024 కోసం సన్నద్ధం కావడం దేశరాజకీయాల్లో ఆకర్షించే అంశంగా మారుతోంది.