iDreamPost
android-app
ios-app

విలక్షణ నటుడు ఇక లేరు

  • Published Apr 29, 2020 | 6:58 AM Updated Updated Apr 29, 2020 | 6:58 AM
విలక్షణ నటుడు ఇక లేరు

నటనతో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ వైవిధ్యాన్ని చూపించే బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు కన్ను మూశారు. గత కొన్నేళ్ళుగా క్యాన్సర్ రూపంలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఇర్ఫాన్ ఖాన్ తిరిగి కోలుకుని సినిమాల్లో నటిస్తున్నారని సంతోషించేలోపే ఈ దుర్వార్త వినడం అభిమానులను కృంగదీస్తోంది. 1988లో సలాం బోంబేతో కెరీర్ మొదలుపెట్టిన ఇర్ఫాన్ ఖాన్ తన 32 ఏళ్ళ కెరీర్ లో భారీ సంఖ్యలో చిత్రాలు చేయకపోయినా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్స్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందారు.

90వ దశకంలో తక్కువ సినిమాలు చేసిన ఇర్ఫాన్ ఖాన్ గ్రాఫ్ 2000 నుంచి ఊపందుకుంది. 2003లో ‘హాసిల్’ సినిమాకు గాను బెస్ట్ విలన్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 2007లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ ఎ మెట్రో’ ఇర్ఫాన్ కు అతి పెద్ద బ్రేక్ అని చెప్పొచ్చు. దీనికి గాను అవార్డులు ప్రశంశలు ఎన్నో దక్కాయి. 2011లో చేసిన ‘పాన్ సింగ్ తోమర్’ తో ఇర్ఫాన్ ఖాన్ పేరు నలుదిశలా మారుమ్రోగిపోయింది. బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు సాధించిపెట్టింది.

ది లంచ్ బాక్స్, హైదర్, గుండే, పీకు, తల్వార్ లాంటి సినిమాల సక్సెస్ లో ఇర్ఫాన్ ఖాన్ షేర్ చాలా ఎక్కువ. 2017లో వచ్చిన ‘హింది మీడియం’ దెబ్బకు ఇర్ఫాన్ ఖాన్ ఫ్యాన్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

హిందిలోనే కాక పలు ఇంగ్లీష్ సినిమాల్లోనూ ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ది వారియర్, నేమ్ సేక్, ది డార్జిలింగ్ అన్ లిమిటెడ్, స్లం డాగ్ మిలియనీర్, న్యూ యార్క్, ఐ లవ్ యు, ది అమేజింగ్ స్పైడర్ మాన్, లైఫ్ అఫ్ పై, జురాసిక్ వరల్డ్, ఇంఫెర్నో లాంటి హాలీవుడ్ చిత్రాల ద్వారా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు కూడా ఇర్ఫాన్ ఖాన్ సుపరిచితుడే. లాక్ డౌన్ కు కొద్దిరోజుల ముందు విడుదలైన అంగ్రేజీ మీడియం సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇర్ఫాన్ ఖాన్ మనసులు గెలుచుకున్నాడు. తెలుగులో ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఒకే ఒక్క సినిమా ‘సైనికుడు’. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మెయిన్ విలన్ గా ఇర్ఫాన్ నటన మనవాళ్ళకూ దగ్గరైంది. 54 ఏళ్ళ చిన్న వయసులోనే కాలం చేసిన ఇర్ఫాన్ ఖాన్ అందరిని శోకసంద్రంలో ముంచెత్తారు.