iDreamPost
android-app
ios-app

పాపం బేబీ నాయిన…!!చిన్నోడిపైనే “లోకల్” భారమంతా

పాపం బేబీ నాయిన…!!చిన్నోడిపైనే “లోకల్” భారమంతా

పత్తాలేని సుజయ్.. బొబ్బిలిలో మారుతున్న రాజకీయం

కొన్ని ఆఫీసుల్లో కొందరుంటారు… ఎక్కడా… ఏ సందర్భంలోనూ పని చేయరు. కానీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల టైం వచ్చేసరిది సరిగ్గా లైన్లో ముందు ఎగబడి పోస్టులు కొట్టేస్తారు. ఫంక్షన్ హాల్ లోను ఇలాంటోడ్లుంటారు. పని జరుగుతున్నంత సేపూ ఎక్కడా కనబడరు. సరిగ్గా పని పూర్తవుతోంది… భోజనాలు మొదలయ్యాఅనగానే హడావుడిగా అటు ఇటు తిరుగుతూ పెద్దరికం చూపుతూ మొదటి బంతిలోనే భోజనాలు పూర్తి చేస్తారు. రాజకీయాల్లోనూ ఇలాంటి పాత్రలుంటాయి. క్యాడర్ ను కాపాడడం, వారి మంచి చెడ్డలు చూడటం వంటి పనులున్నపుడు ఎక్కడెక్కడో తిరగడం, ఫోన్లకు దొరక్కపోవడం వంటివి చేస్తూ సరిగ్గా టిక్కెట్ ఇచ్చే సమయానికి వచ్చి నేనే క్యాండిడేట్ అంటారు. అచ్చం అలాంటి పరిస్థిలే బొచ్చిలిలో నెలకొంది. ఇప్పుడొచ్చిన పంచాయతీ ఎన్నికల నుంచి రేపోచ్చే మండల, మున్సిపల్ ఎన్నికల వరకూ తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెప్పకనే చెప్పేసారు. సహజంగానే ఆయన జనానికి దొరకరు. అయన కనిపించడమే మహద్భాగ్యం అనుకుని జనాలు దూరం నుంచి చూసి మురిసిపోవడం తప్ప ఆయన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో జనాల్లో కలిసింది లేదు.

అయితే ఆయన సోదరుడు కుమార కృష్ణ రంగారావు (బేబీనాయన) మాత్రం కోటను నిత్యం కని పెట్టుకుని ఉంచడమే కాకుండా చుట్టుపక్కల పదిపన్నెండు మండలాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా తప్పక హాజరై వారికి తోడ్పుడతారు. సుజయ్ మంత్రిగా ఉన్నపుడు ఆయన అధికార హోదాను అనుభవిస్తూ ఉండగా ఇక్కడ బేబీ మాత్రం జనాల్లో తిరుగుతూ అందరికి వ్యక్తిగతంగా సాయం చేస్తూ ఉండేవారు.ఈయన క్యాడర్ కష్టసుఖాల్లోనూ తోడుంటారు. అయితే ఇప్పటివరకూ బొబ్బిలి నుంచి గత మూడుసార్లుకూడా సుజయ్ గెలుస్తూ వస్తున్నారంటే దానివెనుక బేబీనాయన కృషే కారణం అన్నది అందరికీ తెలుసు.

అయితే మొన్నటి 2019 ఎన్నికల్లోనూ బేబీనాయనకు టిక్కెట్ ఇస్తే గెలుస్తారు అన్న ఫీలర్ జనాల్లో ఉన్నప్పటికీ సుజయ్ ససేమిరా అంటూ బరిలోకి దిగి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం భారాన్ని బేబీనాయనకు వదిచేసిన సుజయ్ దూరంగా ఉంటున్నారు. కర్చులు, బుజ్జిగింపు లు, క్యాడర్ మేనేజిమెంట్ మొత్తం ఇప్పుడు బేబీనాయనే చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నికల్లో దిగడం అంటే మాటలు కాదు. కానీ ఆయన దేనికీ వెరవకుండా అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు.

గత పదిహేనేళ్లుగా అన్నకోసం పార్టీని, క్యాడర్‌ను మోస్తూ వస్తున్నారు. అయితే మళ్లీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే సమయానికి సుజయ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చి కుటుంబ పెద్దను నేను, నన్ను కాదని నువ్వెలా దిగుతావ్ అని అనేసి టిక్కెట్ లాక్కుంటాడేమో అని క్యాడర్లో అనుమానం వ్యక్తమవుతోంది. అయినా ఆ భావాలేనీ కనబడకుండా బేబీనాయిన మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. సుజయ్ కృష్ణ మాత్రం ఇదంతా దూరం నుంచి చూస్తూ ఎన్నికల సమయంలో టిక్కెట్ వచ్చినపుడు చూడొచ్చులే …ఇప్పటి నుంచి ఖర్చెందుకూ అని మిన్నకుంటున్నారు.