iDreamPost
android-app
ios-app

స్వరామృతం బాలసుబ్రమణ్య గాత్రం – Nostalgia

స్వరామృతం బాలసుబ్రమణ్య  గాత్రం – Nostalgia

“వందనం అభివందనం నీ అందమే ఒక నందనం ” – అచ్చం అక్కినేని పాడినట్టే ఉందే

” జననీ జన్మభూమిస్చ స్వర్గాదపీ గరీయసి” – ఇది ఎన్టీఆర్ గొంతే

” ఇదిగో తెల్లచీర అవిగో మల్లెపూలు ” – ఈ పాట పాడింది కృష్ణ అంటే నమ్మాల్సిందే

” పారాహుషార్ తూరుపమ్మ దక్షిణమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ” – చిరంజీవి స్వరం ఇలాగే ఉంటుంది

“మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు ” – బాలయ్యే పాడినట్టు ఎంత స్వచ్ఛంగా ఉందో

” కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓఓఓఓ ” – నాగార్జున మాస్ అంటే ఇలా ఉండాలి

“జాబిలీకి వెన్నెలకి పుట్టిన పున్నమిలే” – వెంకటేష్ లోని అమాయకత్వం అచ్చంగా దిగిపోయిందే

“శంకరా నాదశరీరాపరా వేదవిహారయారా” సోమయాజులు గొంతు ఇది, అనుమానం లేదు

” వద్దులే ప్రాణమూ నీవు రానప్పుడు ” – మహేష్ బాబు అంత స్వీట్ గా ఉంది వాయిస్

ఇలా తరాలతో సంబంధం లేకుండా స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా అచ్చంగా వాళ్ళే పాడారు అనిపించేలా తన గాన మాధుర్యంతో యావత్ సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తున్న ఎస్పి బాలసుబ్రమణ్యం తెలుగు శ్రోతలకు దేవుడిచ్చిన వరం. ఘంటసాల శకం నడిచినంత కాలం ఒక రకమైన పరవశంలో ఉన్న సినిమా ప్రియులను తన వైపుకు తిప్పుకుని వేలాది పాటలతో తన ప్రస్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించడం ఆయనకే చెల్లింది. బాలు పాటల్లో అత్యుత్తమైనవి ఒక పది ఎంచమంటే తలలు పండైన వాళ్ళు కూడా చేయలేరు. కనీసం 500 అత్యుత్తమ గీతాలను ఎంచుకుంటేనే ఇంకా చాలా వాటిని అవమానించినట్టు అవుతుంది. అలాంటిది కేవలం పది అంటే సాహసమే. అందుకే ఎన్ని జెనరేషన్లు మారినా ఎందరు కొత్త గాయకులు వచ్చినా తన ప్రత్యేకతను చెక్కుచెదరనివ్వకుండా నిత్య యవ్వనుడిలా సాగుతున్న ఆయన గాత్రం నిజంగా అమృతమే.

ఎస్పి బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. 1946లో జూన్ 4వ తేది సాంబమూర్తి, శకుంతల పుణ్యదంపతులకు ఈయన జన్మించారు. తండ్రి వృతి రిత్యా హరికథా విద్వాంసులు. చెన్నైలో ఇంజనీరింగ్ పిజి చేసిన బాలు గారి మొదటిసినిమా 1967లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న.తన గురువు ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో పి సుశీల, పిబి శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్య గార్లతో కలిసి “ఏమి ఈ వింత మోహము” తో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఘంటసాల గారితో కలిసి ఐదు పాటలు పాడే అదృష్టం బాలుగారికి దక్కింది. మొత్తం 16 బాషల్లో తన గాత్రంతో అభిమానులను అలరించారు బాలు. సంగీత దర్శకుడిగానూ సుమారు 60 చిత్రాలకు పని చేయడం ఆయనలోని విద్వత్తును తెలియజేస్తుంది. చిరంజీవి మగధీరుడు, నాగార్జున జైత్రయాత్ర, శోభన్ బాబు జాకీ, జంధ్యాల పడమటి సంధ్యారాగం, అక్కినేని-కృష్ణల ఊరంతా సంక్రాంతి లాంటి ఎన్నో స్టార్ల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు బాలు.

పాడటమే కాదు ఇతర బాషల నుంచి తెలుగులోకి డబ్ అయిన కమల్ హాసన్, భాగ్యరాజ్, రజినీకాంత్, పరేష్ రావల్, రఘువరన్ లాంటి ఎందరికో తన మాటలను ఇచ్చారు. తమిళంలో అనువదించిన నాగార్జున తెలుగు సినిమాలకు బాలునే డబ్బింగ్ చెప్పేవారు. నిర్మాతగానూ భామనే సత్యభామనే, శుభసంకల్పం అందించిన బాలు గారు ఆదిత్య 369కు సమర్పకులు. 6 సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఘనత కూడా బాలసుబ్రమణ్యం గారిదే. ఇక ప్రైవేటు పురస్కారాల గురించి చెబుతూ పోతే అంతు ఉండదు. నటుడిగానూ ఋజువు చేసుకున్న బాలు గారు నాలుగు బాషలలో కలిపి సుమారు 80 సినిమాల్లో నటించారు. ఇప్పటిదాకా 36 వేల పాటలు పాడటం గురించి చెప్పాలంటే తెలుగు బాషలో ఉపమానాలు సరిపోవు. అందుకే యుగాలు జగాలు మారినా ఎస్పి బాలసుబ్రమణ్యం గారి పాటలు మాత్రం భూమి ఉన్నంతవరకు సజీవంగా నిలిచే ఉంటాయి. ఇప్పుడూ యువతరం హీరోలకు మంచి పాటలు పాడే అవకాశం వస్తే వదలని బాలు పేరు సంగీత ప్రియులకు ఒక తారకమంత్రం అంటే అతిశయోక్తి కాదు. అందుకే బాలు పుట్టిన ఈ రోజే కాదు ఆయన పాట విన్న ప్రతి రోజు సంగీత ప్రియులకు పండగే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి