Idream media
Idream media
ఆడలేక మద్దెల దరువు అన్నట్లుంది.. ఏపీలో విపక్షాల తీరు. ప్రభుత్వ లేదా అధికార నేతల వ్యతిరేక కార్యక్రమాల రూపకల్పనలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు ఒకేతీరుగా వ్యవహరిస్తున్నాయి. ఒకే అంశంపై స్పందిస్తున్నాయి. ఒకే విధంగా ముందుకెళ్తున్నాయి. మూడు ఒక్కటే అన్నసంకేతాలను పంపుతున్నాయి. వరుసగా ఆయా పార్టీల ఆందోళన కార్యక్రమాలు, ఇస్తున్న పిలుపులు, ఆయా నేతల వ్యాఖ్యలు దాన్ని రుజువు చేస్తున్నాయి.
ఇప్పుడు క్యాసినో ను ఓ అంశంగా చేసుకుని రాష్ట్రంలో, ప్రధానంగా విజయవాడలో రాజకీయ దుమారం రేపే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణ కోసం అంటూ కమిటీ కూడా వేసింది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కొడాలి నాని వివరణ కూడా ఇచ్చారు. ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేయడమే కాదు.. ఆత్మహత్యకు కూడా వెనుకాడనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఈ అంశంపై ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. ఆధారాలు లేకుండానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
తాజాగా టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. “ప్లేసు నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైం నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. రా తేల్చుకుందాం. నిన్నయినా చంపేస్తా. నేనైనా చస్తా” అంటూ సినీ హీరోలను తలపించేలా డైలాగులు చెప్పేశారు. సమాజంలో అలా బెదిరింపులకు పాల్పడడం నేరం కాబట్టి అరెస్ట్ కు గురయ్యారు. ఇలా ఓ అంశం ఆధారంగా రాజకీయంగా రోజుల తరబడి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగేలా చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఛలో గుడివాడ అంటూ పిలుపు ఇచ్చింది. ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్ వంటి నేతలు, కార్యకర్తలతో గుడివాడలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో గుమిగూడి గుడివాడ వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నందమూరి వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమవుతాయని పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా బీజేపీ నేతలు వినిపించుకోలేదు. చివరకు సోము వీర్రాజు అరెస్ట్ అయ్యారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏ అంశాన్ని పట్టుకుని తొలుత టీడీపీ రాద్దాంతం మొదలు పెడుతుందో.. రెండు మూడు రోజులు అటూ ఇటుగా బీజేపీ.. ఆ వెంటనే జనసేన లైన్ లోకి వచ్చేస్తున్నాయి. మధ్యలో బీజేపీ అప్పుడప్పుడు టీడీపీ పై కూడా విమర్శలు చేసినా.. మళ్లీ ఆ పార్టీ బాట పడుతుంది. క్యాసినోనే కాదు.. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు, హత్యా రాజకీయాలు, అప్పులు.. ఇలా చాలా అంశాల్లో అది కనిపిస్తుంది. దీన్ని బట్టి మూడూ ఒక్కటే అన్న ప్రచారాలు అందుకే జరుగుతున్నాయేమో అనిపిస్తుంది.