iDreamPost
android-app
ios-app

BJP, Telangana – వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతున్న బీజేపీ

BJP, Telangana – వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతున్న బీజేపీ

తెలంగాణ‌లో కొన్నేళ్ల పాటు ఉనికి కోసం పోరాడిన బీజేపీ.. అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక‌లో విజ‌యం అనంత‌రం దూకుడు పెంచ‌డం మొద‌లుపెట్టింది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన హ‌డావిడి అయితే అంతా ఇంతా కాదు. అగ్ర‌నేత‌ల‌ను రంగంలోకి దించి స్థానిక సంగ్రామాన్ని హోరెత్తించింది. ఆ హోరులో అనుకున్న ల‌క్ష్యం కూడా సాధించింది. గ‌తం కంటే అత్య‌ధిక స్థానాల‌ను సాధించి తెలంగాణ‌లో ప‌ట్టు పెంచుకుంది. దీంతో బీజేపీ నాయ‌క‌త్వంలో ఉత్సాహం రెట్టింప‌యింది. అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా క‌మిటీల ఏర్పాటు, కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో నూత‌న‌త్వం తీసుకొచ్చింది. హుజూరాబాద్ లో గెలుపు అనంత‌రం త‌మ‌కు తిరుగులేద‌నుకుంటున్న అధికార పార్టీని సైతం క‌ల‌వ‌రానికి గురి చేయ‌డం మొద‌లుపెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రింత‌ పుంజుకోవ‌డానికి అన్ని మార్గాల‌లోనూ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మ‌ష్టిగా, గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే ఎన‌భై వ‌ర‌కూ సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌లు లెక్క‌లు క‌డుతున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి స‌రైన అభ్య‌ర్థులు లేర‌నే చెప్పాలి.అందుకే బీజేపీ ముందుగా బ‌ల‌మైన నేత‌ల‌పై దృష్టి సారిస్తోంది. జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తి ఉన్న వారిని, సామాజికంగా బ‌లంగా ఉండి కొన్ని కార‌ణాల‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న వారిని, కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌పై కూడా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ముందుగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. పార్టీ అధిష్ఠానం కూడా రాష్ట్ర బీజేపీ నాయకులకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో ఇక్కడి నేతలు దూకుడు పెంచారు.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కూడా అవ‌కాశంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇక స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీకి ఆశపడి భంగపడ్డ టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకు ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌లోనూ విభేదాలున్నాయి. చాలా మంది నాయకులకు పరస్పరం పడడం లేదు. అందుకే అలాంటి వాళ్లను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పాల‌న‌పై అసంతృప్తి ఉన్న ఉద్య‌మ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. స్వామిగౌడ్, రవీందర్ నాయక్, ఈటల రాజేందర్ తో సహా కొంత మంది నాయకులు అలా వచ్చినవాళ్లే. వాళ్లకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. తాజాగా విఠల్ కూడా బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని చిన్న పార్టీలను విలీనం చేసుకోవడంపై కూడా బీజేపీ దృష్టి సారించింది.

తాజాగా యువ తెలంగాణ పార్టీని కలిపేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరక ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమలతో మంతనాలు పూర్తి చేశారు. అలాగే ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన మరో పార్టీని విలీనం చేసుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.మొత్తంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి.. ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాల‌ని గ‌ట్టి కృషి అయితే బీజేపీ చేస్తోంది. మ‌రి ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాలి.

Also Read : BJP, Telangana – అభ్యర్థులే లేరు.. అధికారం ఎలా?