iDreamPost
android-app
ios-app

సచిన్‌కు బీజేపీ ఆహ్వానం.. పైలెట్‌ పయనమెటు..?

సచిన్‌కు బీజేపీ ఆహ్వానం.. పైలెట్‌ పయనమెటు..?

సచిన్‌ పైలెట్‌ను డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం తొలగించడంతో రాజస్థాన్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ ఇలా నిర్ణయం తీసుకున్న వెంటనే బీజేపీ తెరపైకి వచ్చింది. సచిన్‌ పైలెట్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. ఇప్పటి వరకూ తెర వెనుక నుండి కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ ఈ రోజు తొలిసారిగా బహిరంగంగా ప్రకటన చేసింది. ఆ పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాశ్‌ మథుర్‌ మీడియా సచిన్‌ పైలెట్‌ను బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీ విధానాలు నచ్చిన వారు ఎవరైనా సరే పార్టీలోకి రావొచ్చని ఆయన పేర్కొన్నారు.

తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ బీజేపీ చేసిన ప్రకటనపై సచిన్‌ పైలెట్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే తాను బీజేపీలో చేరనంటూ ఆయన ప్రకటించారు. ప్రగతిశీల కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ పెడతారంటూ కూడా ప్రచారం సాగుతోంది. అశోక్, సచిన్‌ బలాబలాలు ఏమిటో రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో బల నిరూపన ద్వారా ఇది స్పష్టమయ్యే ఛాన్స్‌ ఉంది. ఆ తర్వాత సచిన్‌ తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరో వైపు ఓం ప్రకాశ్‌ మథుర్‌ ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాత్‌ తనకు సంపూర్ణ బలం ఉందని చేసిన ప్రకటనపై కూడా స్పందించారు. అశోక్‌ గెహ్లాత్‌కు బలం ఉంటే అసెంబ్లీలో నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. నిన్న, ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశానికి 104 నుంచి 106 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం అశోక్‌ గెహ్లాత్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాతో భేటీ అయ్యారు. తనకు ఉన్న ఎమ్మెల్యే మద్ధతుపై గవర్నర్‌తో సీఎం అశోక్‌ చర్చించే అవకాశం ఉంది. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకముందే అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమవుతారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ సీన్‌లోకి రావడంతోపాటు, రోజులు గడిచే కొద్దీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందన్న ఆలోచనలో అశోక్‌ గెహ్లాత్‌ వర్గం వ్యూహాలు రచిస్తోంది. బలనిరూపణ జరిగితే రెబల్‌ ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయవచ్చనే ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది.

కాగా, 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 200 సీట్లకు గాను 107 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 72 సీట్లకు పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 ఎమ్మెల్యేలు అవసరం కాగా కాంగ్రెస్‌కు ఆరు సీట్లు అదనంగానే ఉన్నాయి. అయితే ఆ పార్టీ బీటీపీ(2), సీపీఐ(ఎం) (2), ఆర్‌ఎల్‌డీ (1), స్వతంత్రులు 12 మంది తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీతోపాటు ఆర్‌ఎల్‌పీ(3), ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నారు.