Idream media
Idream media
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఆదివారం చల్లగా ఉన్నప్పటికీ.. వరంగల్ లో మాత్రం రాజకీయ వేడి రగులుకుంది. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు భగ్గుమన్నాయి. నాయకుల నుంచి కార్యకర్తల వరకూ విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ హీట్ పెంచాయి. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ దుమారానికి దారి తీశాయి. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు, పదజాలంతో వివాదానికి తెర లేపారు. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ లపై తీవ్ర స్థాయిలో అర్వింద్ వ్యాఖ్యలు చేశారు. బిల్లా.. రంగా అంటూ ఇద్దరినీ సంభోదించారు. ఎక్కడా గజం భూమి మిగల్చకుండా కబ్జాలు చేస్తూ పోతున్నారని ఆరోపించారు.
దాడికి.. ప్రతి దాడి..
అర్వింద్ ఆరోపణల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు సైతం నిరసన స్వరం పెంచారు. వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ వెంటనే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి అర్వింద్ పై ధ్వజమెత్తారు. పసుపు బోర్డు పేరుతో నిజామాబాద్ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆధారాలు లేకుండా భూ కబ్జాలపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తాను ఎక్కడైనా కబ్జాకు పాల్పడినట్లు రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, చేయలేక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా..? అని అర్వింద్ కు నన్నపునేని నరేందర్ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబంపై రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేస్తే జనం ఊరుకోరని హెచ్చరించారు.
ఇరు పార్టీల కార్యకర్తలూ అరెస్ట్..
నాయకుల మధ్య వివాదం కార్యకర్తల్లో కూడా ఆగ్రహం పెంచాయి. అరవింద్ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యకర్తలు బీజేపీ వరంగల్ అర్బన్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లతో అరవింద్ కాన్వాయ్ పై సైతం దాడికి యత్నించారు. పోలీసులు రంగంలోకి దిగి కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే విజయ భాస్కర్ క్యాంప్ కార్యాలయంపై దాడికి దూసుకెళ్లారు. జిల్లా అధ్యక్షురాలు, రూరల్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కార్యకర్తలు కార్యాలయం వైపు వెళ్లుండగా పోలీసులు అడ్డగించారు. దీంతో అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు ప్రయత్నించారు. అక్కడ కూడా పోలీసులు అడ్డగించారు. ఓ దశలో పరిస్థితి పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. బీజేపీ నేత రావు పద్మ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం కొంత మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన వాదోపవాదాలు, కార్యాలయాలపై దాడి, ప్రతిదాడులతో వరంగల్ లో ఆదివారం జరిగిన రాజకీయ రచ్చ ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే ఇరు పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు ఈ ఘటనలకు సంబంధించి ఖండనలు, సవాళ్లు విసురుకుంటున్నారు.