iDreamPost
android-app
ios-app

టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఆర్ ఎస్ పి : తెర‌పైకి కొత్త ఆరోప‌ణ‌లు

టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఆర్ ఎస్ పి : తెర‌పైకి కొత్త ఆరోప‌ణ‌లు

కొత్త పార్టీ కాక‌పోయినా పోటీకి సై అంటూ.. రాజ‌కీయంగా తెలంగాణ‌లో కొత్త కాక‌ను పుట్టిస్తోంది బీఎస్పీ. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆ పార్టీలో చేరికే అట్ట‌హాసంగా సాగింది. ఆ సంద‌ర్భంగా ప్ర‌వీణ్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపైన‌, కేసీఆర్ పైన చేసిన విమ‌ర్శ‌లను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ద‌ళితబంధు వంటి ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం ద్వారా ఆ వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంటే, బ‌డుగులకు రాజ్యాధికార‌మే త‌మ ల‌క్ష్య‌మంటూ బీఎస్పీ నుంచి ప్ర‌వీణ్ కుమార్ పోరాటానికి సిద్ధం కావ‌డం ఇప్పుడు రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల మంట‌ల‌ను రాజేస్తోంది.

ప్ర‌వీణ్ కుమార్ టార్గెట్ గా టీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తుంటే, బీఎస్సీ నుంచి కూడా అదే విధంగా ప‌లువురు నేత‌లు బ‌దులిస్తున్నారు. క‌రోనా స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో ప్ర‌వీణ్ ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం కాగా, బీఎస్పీ శ్రేణులు మాత్రం స‌మావేశాలు పెట్టి టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల బీఎస్పీలో చేరిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై విమర్శలు చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు బెదిరింపు కాల్ కూడా వచ్చింది. ఎదురుగట్ల సంపత్‌ అనే స్వేరో కార్యకర్త ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి దురుసుగా మాట్లాడిన‌ట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్ర‌వీణ్ వెనుక బీజేపీ..

అంత‌కు ముందు గ్యాద‌రి కిషోర్ ప్రవీణ్‌కుమార్ పై విమ‌ర్శ‌లు చేశారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తేనే గురుకుల పాఠశాలల కోసం ప్ర‌వీణ్ ప‌ని చేశార‌ని, ఆయ‌న‌కు పదవి వస్తే రాజ్యాధికారం వచ్చినట్లా? అని కిషోర్ ప్రశ్నించారు. ప్రవీణ్‌ చేరిన పార్టీ.. యూపీలో రాజ్యాధికారం తేలేకపోయిందన్నారు. ప్రవీణ్‌ కోటు వేసుకుని అభిన‌వ అంబేడ్క‌ర్ ఫీల్ అవుతున్నారని, బీజేపీ కుట్రలో భాగంగా ప్రవీణ్‌కుమార్ వస్తున్నారని గ్యాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకులాలు తెచ్చింది కేసీఆర్.. కానీ దాని ఫలితాన్ని ప్రవీణ్‌కుమార్ తన ఖాతాలో వేసుకున్నారని దుయ్యబట్ట‌డం బీఎస్పీ శ్రేణుల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. బీజేపీ ప్రాంతీయ పార్టీలను విచ్చిన్నం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ అడ్రస్ లేకుండా పోయారని, ప్రవీణ్‌కుమార్‌కు అలాగే అవుతారని గ్యాదరి కిషోర్ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను తిడితే నాయకులు కాలేరని, దళితబంధును చూసి కొందరు వణికి పోతున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. దళిత బంధుతో ఆ వర్గాలను ఎలా బాగుచేయాలోనని ఆలోచించాల‌ని ప్రవీణ్‌కుమార్ కు సూచ‌న‌లు చేశారు.

మేం బీజేపీ ఏజెంట్లము కాదు..

ప్ర‌వీణ్ వ‌ర్గం టీఆర్ఎస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాము బీజేపీ ఏజెంట్ల‌ము కాద‌ని, అంబేడ్క‌ర్ వార‌సుల‌మ‌ని బీఎస్పీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఇబ్రాం శేఖ‌ర్ తాజాగా బ‌దులిచ్చారు. గ‌తంలో ఐఏఎస్ అధికారి ముర‌ళిని ప్ర‌భుత్వం అవ‌మానించిన‌ప్పుడు ఎమ్మెల్యే కిశోర్ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఓ స్వేరో కార్య‌క‌ర్త నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కిశోర్‌కు బెదిరింపు కాల్ కూడా వచ్చింది. ‘‘ప్రవీణ్‌ సార్‌ని విమర్శించే కేటగిరీనా నీది. నా జాతి బిడ్డవని మర్యాదగా మాట్లాడుతూన్నా. అదే ఇంకోడైతే వేరేగా ఉండు. నిన్ను బెదిరించాల్సిన అవసరం లేదు. నీ మాట చూస్తే అర్థం కావడం లేదా.. భయపడుతున్నావన్న సంగతి. నువ్వు ఎవరైతే నాకేంది. నువ్వు నా ఈకతో సమానం’’ అని ఫోన్‌లో స్వేరో కార్య‌క‌ర్త‌ సంపత్‌ ఘాటుగా మాట్లాడాడు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కిషోర్‌.. ‘‘ఏం నన్ను బెదిరిస్తున్నవ. నేను భయపడుతున్నానా? చూస్తావా గాదరి కిషోర్‌గాడేందో. డ్రామాలు చేస్తున్నవ్‌.. నాకు ఫోన్‌ చేసి బెదిరిస్తవా. ఏమనుకుంటున్నవ్‌’ అంటూ బదులిచ్చారు. ఈ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టీఆర్ఎస్, బీఎస్పీ నేత‌లు ఇలా ఒక‌రికొక‌రు మాట‌ల యుద్ధానికి దిగ‌డం, మ‌ధ్య‌లో బీజేపీని లాగ‌డం వెనుక బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఓట్ల‌పై రెండు పార్టీలూ దృష్టి సారించాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా, తెలంగాణ రాజ‌కీయ తెర‌పై ఇప్పుడు మ‌రో పార్టీ వాయిస్ కూడా వినిపిస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉన్న ప్ర‌వీణ్ ఫోన్ లో అందుబాటులో ఉండి రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఊరూరా దండోరా మోగించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మున్ముందు ఇరు పార్టీల మ‌ధ్య రాజ‌కీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Also Read : విధేయుడు, ఉద్యమకారుడికే టికెట్.. హుజూరాబాద్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్