Idream media
Idream media
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎల్ .రమణ మాత్రం ఇంకొ కొనసాగుతూనే ఉన్నారు. ఎందరో నేతలు తెలుగుదేశాన్ని వదిలి ఇతర పార్టీల్లో చేరి పదవులు అనుభవిస్తున్నా పాపం రమణ ఆ పార్టీనే ఇప్పటి వరకూ అంటిపెట్టుకున్నారు.
రమణ కూడా పార్టీ మారబోతున్నారన్న వార్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కారెక్కబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే, ప్రస్తుతం నేతలను ఆకర్షించే పనిలో ఉన్న బీజేపీ రమణను పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రమణకు ఆ పార్టీ నాయకులు పలు హామీలు గుప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో జాకీలు పెట్టి లేపినా టీడీపీ లేచే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన రమణ ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం జగిత్యాల నుంచి హైదరాబాద్ వచ్చిన రమణ మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏ పార్టీలో చేరేది, లేనిది స్థానికంగా ఆయా పార్టీల కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ మీద కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలుత టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు రమణ రెఢీ అయినట్లుగా ప్రచారం జరిగింది. ఆయన పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి.. మంత్రిని చేస్తానన్న ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ లోని చాలామంది నేతలకు రమణ సన్నిహితుడన్న విషయం తెలిసిందే. వారంతా కూడా ఒకప్పటి తెలుగుదేశం పార్టీలోని వారేకావటంతో ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. అయితే.. కేసీఆర్ మూడ్ మొదట్లో బాగానే ఉన్నా.. పార్టీలోకి చేరిన తర్వాత ఆయన తీరు మరోలా ఉంటుందన్న ఆలోచనలో రమణ ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఎల్. రమణను తమ పార్టీలోకి బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఆయనకు సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మాట ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. రమణ కుమారుడికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటమే కాదు..గెలుపు బాధ్యత కూడా తీసుకుంటామన్న మాట ఇచ్చినట్లుగా సమాచారం.
అయితే, తాజాగా రమణ మాట్లాడుతూ తాను పదవులను ఆశించే వ్యక్తిని కాదని చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ తనను ఆహ్వానిస్తున్నాయని, ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, తాను ఫలాన పదవులను డిమాండ్ చేస్తున్నానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని చెప్పారు. రమణ మాటలను బట్టి పార్టీ మారడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. మరి ఎటువైపు మొగ్గుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.