iDreamPost
android-app
ios-app

Chandrababu – Sunil Deodhar : బాబు ఆశలపై నీళ్లు చల్లిన సునీల్‌..!

Chandrababu – Sunil Deodhar : బాబు ఆశలపై నీళ్లు చల్లిన సునీల్‌..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం ఏ మాత్రం కలసి రావడం లేదు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత.. మళ్లీ లేచి నిలబడేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మళ్లీ నడవచ్చనే ఆశతో.. బీజేపీకి దగ్గర అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ వర్క్‌అవుట్‌ కావడం లేదు. బద్వేల్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించి కూడా మళ్లీ వెనక్కి తగ్గి, పోటీ చేయకుండా బీజేపీ కోసం చేసిన త్యాగం వృథా అయిపోయింది. టీడీపీ నేతలను బీజేపీ ఏజెంట్లుగా కూర్చొబెట్టినా.. బీజేపీ నేతల నుంచి ఆశించిన స్పందన దక్కలేదు. పైగా బీజేపీ నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

టీడీపీతో బీజేపీ పొత్తు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. బీజేపీ జాతీయ నేత, ఏపీ రాష్ట్ర సహ ఇంచార్జి సునిల్‌ దియోధర్‌ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు ఎప్పటికీ ఉండదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి బాబు ఆశలపై నీళ్లు చల్లారు. సీట్ల కోసమో, సీఎం పదవి కోసమో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. టీడీపీ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అంటూ విమర్శించి.. బాబు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టారు.

Also Read : Kuppam Municipal Elections – చంద్రబాబుకి కఠిన పరీక్షగా మారిన మునిసిపల్ ఎన్నికలు, కుప్పంలో గట్టెక్కేదెలా

బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కోసం కమలం పార్టీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటి కొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. ఈ నేతలందరూ 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న వారే. ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యులైన వీరిని చంద్రబాబే.. బీజేపీలోకి పంపించారనే ప్రచారం సాగింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడైనా, ఆ తర్వాత సోము వీర్రాజు అధ్యక్షుడుగా అయిన తర్వాత, ఈ నేతలు.. బీజేపీ, టీడీపీకి మధ్య వారధులుగా పని చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావుల ప్రకటనలకు భిన్నంగా ఈ నేతలు ప్రకటనలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ నేతలు ఒకటి చెబితే.. ఆ పార్టీలో ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరిలు భిన్నంగా మాట్లాడారు.

ఇప్పుడు పొత్తుల విషయంలోనూ సీఎం రమేష్‌.. బీజేపీ నేతల ప్రకటనలకు కౌంటర్‌ ఇచ్చేలా మాట్లాడుతున్నారు. టీడీపీతో పొత్తు ఉండదని, ఆ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరగా ఉందని సునీల్‌ దియోధర్‌ మాట్లాడితే.. పొత్తుల విషయం తేల్చేది పార్టీ అధిష్టానమని, సునీల్‌ కాదంటూ సీఎం రమేష్‌ కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం. అయితే పార్టీ అధిష్టానం వేరు. తాము వేరు కాదని, పార్టీకి కళ్లు, చెవులు తామేనంటూ వ్యాఖ్యానించిన సునిల్‌ పార్టీలో తమ స్థాయి ఏమిటో చెబుతూ.. అదే సమయంలో సీఎం రమేష్‌ స్థానం ఏమిటో పరోక్షంగా గుర్తు చేశారు. ప్రస్తుతానికైతే.. బీజేపీతో పొత్తు కోరుకుంటున్న బాబు ఆశలు సునిల్‌ దియోధర్‌ వ్యాఖ్యలతో అడియాశలయ్యాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా బాబు తన ప్రయత్నాలను కొనసాగిస్తారనడంలో సందేహం లేదు.

Also Read : Gorantla Butchaih Chowdary – బుచ్చయ్య ఇదేనా మీ అనుభవం..?