Idream media
Idream media
మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి పై ఇంతలా ప్రచారం జరిగే రోజులొస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. సంవత్సరాల తరబడి రాష్ట్రాన్ని ఏక పక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించి దేశంలోనే సంచలనం సృష్టించింది తెలుగుదేశం. 1999-2004 మధ్య కాలంలో లోక్‌సభ లో 29 మంది సభ్యులతో నాలుగో పెద్ద పార్టీగా నిలిచిన టీడీపీ ప్రస్తుతం కనీసం నాలుగు జిల్లాల్లో కూడా ప్రభావం చూపలేని స్థితిలో ఉంది. అధికారం కోల్పోయిన 17 నెలల కాలంలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ కి స్వస్తి పలికారు. నియోజకవర్గాల్లో కొత్తగా నలుగురు సభ్యులను పెంచుకునే అవకాశాలు కూడా కరువయ్యాయి.
ఎందుకిలా..?
గత ఎన్నికల అనంతరం ఏపీలో ఘోర పరాజయం పాలైన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆ పరిణామాలతో కాస్త కలతచెందారు. కొన్నాళ్ల పాటు పార్టీ అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించినట్లుగా ఎటువంటి కార్యక్రమాలూ జరగలేదు. ఇక ఈ సంవత్సరం అయితే ఇక చెప్పనవసరం లేదు. కరోనాతో తెచ్చిన లాక్ డౌన్ పేరు చెప్పి అత్యధిక కాలం తెలంగాణలోనే చంద్రబాబు ఉండిపోయారు. జూమ్ సమావేశాలు పెట్టి ప్రసంగించడం మినహా నేతలను నేరుగా కలిసింది పెద్దగా లేదు. మిగతా రోజుల్లో ఎలాగున్నా.. తెలుగుదేశం మహానాడు ఏర్పాట్ల నుంచి ముగిసే వరకూ కార్యకర్తలు, నేతల్లో జోష్ కనిపించేంది. ఆ ప్రభావం కొన్నాళ్ల పాటు పని చేసేది. కరోనా కారణంగా ఈ సంవత్సరం మహానాడు కూడా వర్చువల్ గానే జరిగింది. దీంతో మహానాడు కూడా పార్టీ శ్రేణులను పెద్దగా ఉత్సాహపరచలేకపోయింది. దీనికి తోడు ఏడాది కాలంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పార్టీకి చేటు తెచ్చేలా ఉంటున్నాయి. మూడు రాజధానులను వ్యతిరేకించడం, కొత్తగా హిందూత్వ వాదాన్ని అనుసరించడం కూడా ఆ పార్టీకి చేటు తెచ్చాయి.
సందట్లో సడేమియాలా.. బీజేపీ
ఏపీలో తెలుగుదేశం ప్రాభవం తగ్గుతుండడంతో ఇదే అవకాశంగా బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర పెద్దలు కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాక పార్టీ కార్యకలాపాలను పెంచారు. శ్రేణులను ఆకట్టుకునేలా తరచూ వారితో మాట్లాడుతున్నారు. ఆయనకు తోడు ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రానికి వస్తూ, పోతూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం టార్గెట్ గా ప్రకటనలు ఇస్తున్నారు. బీజేపీ గురించి టీడీపీ నేతలెవరైనా ఏమాత్రం నోరుజారినా వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది ముగిసిన అధ్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ పార్టీయో… జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. ‘టీడీపీలో కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు మాకు సలహాలిస్తున్నారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరిందని వెల్లడించారు. టీడీపీ గురించి ఇంతలా మాట్లాడే అవకాశం బీజేపీ నేతలకు చిక్కడానికి కారణం ఏపీలో ఆ పార్టీపై ప్రజల్లో ఆదరణ సన్నగిల్లుతుండడమే.