iDreamPost
android-app
ios-app

వాటిని వదిలేసి.. ఉద్యమాలెందుకు వీర్రాజుగారు!

  • Published Feb 11, 2022 | 6:02 AM Updated Updated Feb 11, 2022 | 6:02 AM
వాటిని వదిలేసి.. ఉద్యమాలెందుకు వీర్రాజుగారు!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు హఠాత్తుగా ఉత్తరాంధ్రపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ మూడు జిల్లాలు సాగునీరందక, ప్రాజెక్టులు రాక చాలా ఇబ్బంది పడిపోతున్నాయంటూ బోలెడంత సానుభూతి, జాలి కురిపించారు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఐదు రోజుల ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యారు. విశాఖ నుంచి మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ విషయం వెల్లడించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని నాయకులకు సూచించారు. ఉత్తరాంధ్రపై ప్రేమ పుట్టినందుకు సంతోషమే గానీ.. బీజేపీ ప్రధాన భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి ఊసు వదిలేసి.. ఉద్యమాలు చేయడం వల్ల ఏం ఒరుగుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ముందు వాటిని సాధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ పథకాలకు సహకరించని కేంద్రం

పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు కూడా వరప్రదాయినే. ఈ ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువకు అనుసంధానిస్తూ 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఎడమ కాలువపై పురుషోత్తపట్నం, పాపయ్యపాలెం ప్రాంతాల్లో లిఫ్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నాలుగు ప్రతిపాదిత రిజర్వాయర్లకు గోదావరిలో వరద ఉన్న సమయంలో 63.2 టీఎంసీల నీటిని తరలించి నిల్వ చేయడం ద్వారా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో 8 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించారు. అలాగే 1200 గ్రామాల్లోని 30 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చాలని సంకల్పించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే తప్ప ఇది సాకారం కాదు. కానీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా సకాలంలో నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంభిస్తోంది. సవరించిన అంచనాలు కాకుండా పాత అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని, పునరావాస ఖర్చులు రాష్ట్రమే భరించాలని కొర్రీలు పెడుతోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు.

ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏదీ?

రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు యూపీలోని బుందేల్ ఖండ్, ఒడిశాలోని కేబీకే ప్రాంతాలకు ఇస్తున్నట్లు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అప్పట్లో ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్లో కేటాయించాల్సిన ఈ నిధులను ఆరేళ్లుగా నిలిపివేశారు. విభజన చట్టంలోని మరో కీలక హామీ అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును నాలుగేళ్ల క్రితం ప్రకటించినా ఇప్పటికీ దాని కార్యకలాపాలు ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారు.
కొత్త పరిశ్రమల సంగతెలా ఉన్నా ఉన్న పరిశ్రమల ఉసురు తీసే కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశంలో అతిపెద్దదైన విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీనిపై పెద్ద ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు మేజర్ పోర్ట్ అయిన విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ లోని బెర్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే 16 బెర్తులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కానీ కేంద్రంలోని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వీటిని ఆపించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కనీస ప్రయత్నం కూడా చేయడంలేదు. సమస్యంతా తమ వైపు ఉంచుకుని.. ఏ ముఖం పెట్టుకుని ఉద్యమం చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఇవన్నీ సాధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : బీజేపీ నోటా.. అదే మాట!