iDreamPost
android-app
ios-app

వీర్రాజు ప్లేట్‌ ఫిరాయించారేంటి..?

వీర్రాజు ప్లేట్‌ ఫిరాయించారేంటి..?

ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న బీజేపీ అందుకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానమైనది రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజును నియమించడం. ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందని పార్టీ పెద్దలు ఆశించారు. పెద్దలు ఆశించిన విధంగానే సోము వీర్రాజు పని చేయడం మొదలుపెట్టారు.

సోము వీర్రాజు మోకాలును పెట్టి ముందుకు తోసినా.. కమలం పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తేలిపోయింది. సోము పార్టీ పగ్టాలు చేపట్టిన ప్రారంభంలో కొనసాగిన వలసలు.. ఆ తర్వాత ఆగిపోయయి. ఇప్పుడు బీజేపీ వైపు చూసే నాయకుడే లేరు. బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా ఉండడానికి ఏపీ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరే ప్రధాన కారణంగా నిలుస్తోంది.

విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి అంశాలపై సోము వీర్రాజు ఎలాగోలా లాగించుకొస్తున్నారు. కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మాత్రం సోము వీర్రాజు ఏమీ చేయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తలఊపే క్రమంలో నాలుక కూడా మడతేయాల్సిన పరిస్థితి సోము వీర్రాజుకు తలెత్తింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు కార్మికులు, ఏపీ ప్రజలు వ్యతిరేకించారు. విశాఖ కేంద్రంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రారంభ సమయంలో ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ నేపథ్యంలో భవిష్యత్‌పై కార్మికుల ఆందోళన, రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళతామని చెప్పిన సోము వీర్రాజు ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించారు.

రాష్ట్రంలో ప్రైవేటీకరణ పాత విషయమేనంటూ తాజాగా సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. రాష్ట్ర నాయకులు ఎప్పుడో ప్రైవేటీకరణను స్వాగతించారని చెబుతున్నారు. గతంలో పాల డెయిరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు, చక్కెర మిల్లులు అమ్మేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మాత్రం అందరూ మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వల్ల ఏడాదికి 1300 కోట్ల నష్టం వస్తోందని చెప్పిన సోము వీర్రాజు ప్రైవేటీకరణ తధ్యమనేలా మాట్లాడారు. ప్లాంట్‌కు, కార్మికులకు నష్టం జరగదంటూ సోము భరోసా ఇస్తుండడం కొసమెరుపు.

Also Read : జగన్‌ ప్లాన్‌ అదిరింది .. ఆచరిస్తే ఎమ్మెల్యేలకు ఎదురుండదు